మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), ఆగస్టు 15 : బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఏనాడూ రైతులకు యూరియా రానివ్వలేదని, ఎంత కావాలంటే అంత యూరియా దొరికేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పంద్రాగస్టు వేడుకలో పాల్గొనడానికి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి దుబ్బాకకు వెళ్తూ అక్బర్పేట-భూంపల్లి మండల కేంద్రంలోని మన గ్రోమోర్ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరడం చూసి ఆగారు. ఈ సందర్బంగా రైతులు ఎమ్మెల్యేతో గోడువెళ్లబోసుకున్నారు. తాము శుక్రవారం ఉదయం 5 గంటల నుంచే క్యూలు కట్టామని, ఆధార్ కార్డుకు ఒక్క యూరియా బస్తా ఇవ్వడంతో పాటు ఓటీపీ అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు తమ బాధను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
ఉదయం నుంచి రైతులు యూరియా కోసం క్యూలో నిరీక్షిస్తుంటే వ్యవసాయ అధికారులు ఒక్కరూ ఇక్కడ ఉండరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సరఫరాలో పూర్తిగా విఫలమైందన్నారు. కేసీఆర్ పాలనలో హమాలీ ఖర్చులను భరించి యూరియాను రైతులకు పంపిణీ చేశామని గుర్తుచేశారు. కేసీఆర్ పదేండ్ల కాలంలో సీజన్‌కు ముందే ప్రతి మండలంలోని గోదాముల్లో ఎరువులు నిల్వ చేసి సరిపడా పంపిణీ చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అక్బర్పేట-భూంపల్లి మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి, రైతులు ఉన్నారు.