చిన్నశంకరంపేట, నవంబర్ 3 : ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో దళారులు నేరుగా రైతుల వద్ద వడ్లను కొంటున్నారు. ప్రభుత్వం 20 రోజలు క్రితం అట్టహాసంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. కానీ, ధాన్యం కాంటా చేయడం లేదు. ఇదే అదునుగా భావించిన దళారులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొంటున్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వచ్చి దళారులు ధాన్యం తూకం వేస్తున్నారు. ఇంత జరిగినా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మండలంలోని అంబాజిపేట కొనుగోలు కేంద్రంలో దళారులు ధాన్యాన్ని కొనుగోలు చేసి లారీల్లో తరలించారు. ఇప్పటికైనా కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కౌడిపల్లి, నవంబర్ 3: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలో ధాన్యాన్ని సేకరించడం లేదు. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తప్పేది లేక రైతులు దళారులకు వడ్లను అమ్ముకుంటున్నారు. కౌడిపల్లి మండలంలోని కొట్టాల గ్రామం లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఆదివారం రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాల్లో త్వరగా కాంటా పెట్టాలని రైతులు కోరుతున్నారు.