మెదక్, జనవరి 30(నమస్తే తెలంగాణ): మెతుకుసీమ మెదక్ జిల్లాలో అన్నదాతలకు కరెంట్ షాక్ ఇస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయానికి 13 గంటలు మించి కరెంట్ సరఫరా కావడం లేదు. దీంతో పాటు రాత్రిపూట కరెంట్ ఇస్తుండడంతో రైతులు విద్యుత్ షాక్ గురై చనిపోతున్నారు. మెదక్ జిల్లాలో ఈ యాసంగిలో 2,95,200 ఎకరాల్లో రైతులు వరినాట్లు వేసినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జొన్న 9980 ఎకరాలు, మొక్కజొన్న 3100 ఎకరాలు, సన్‌ఫ్లవర్ 568 ఎకరాలతో పాటు ఇతర పంటలు సాగు చేస్తున్నారు.
యాసంగిలో అన్ని పంటలు కలిపి 3,17,380 ఎకరాల్లో రైతులు పంటలు వేసినట్లు అధికారులు అంచనా వేశారు. రైతులకు కరెంట్ సమస్యతో పాటు ఎరువుల సమస్య వేధిస్తున్నది. ఘనపూర్ ఆనకట్టకు సింగూర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేయలేదు. దీంతో రైతులు బోరుబావుల ఆధారంగా వరినాట్లు వేశారు. వ్యవసాయానికి రాత్రి కరెంట్ సరఫరా చేయడంతో రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కరెంట్ సరఫరాలో తరుచూ అంతరాయం ఏర్పడుతున్నది. నాణ్యమైన కరెంట్ సరఫరా లేక ట్రాన్స్ఫార్మర్లు, స్టార్టర్లు, మోటర్లు మాటిమాటికి మరమ్మతులకు గురవుతున్నాయి. వాటిని సరిచేయడానికి ప్రయత్నిస్తూ రైతులు కరెంట్ షాక్‌కు గురై చనిపోతున్నారు.
ఇటీవల రామాయంపేట, చేగుంట, వెల్దుర్తి, కొల్చారం మండలాల్లో కరెంట్ షాక్‌కు గురై రైతులు పొలాల వద్దే మృతిచెందారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చాలామంది రైతులు కరెంట్ షాక్‌కు గురై చనిపోయారు. చేగుంట మండలం రుక్మాపూర్‌లో రైతు మేకల కాశయ్యల్ల కిష్టయ్య మృతిచెందాడు. ఇబ్రహీంపూర్‌కు చెందిన రైతు ఎగ్గడి స్వామి, కుమ్మరి మోహన్, బెదరిబోయిన సంతోష్, మర్సల్లి శ్రీనివాస్ కరెంట్ షాక్‌తో మృతిచెందారు. బోనాల్ గ్రామానికి చెందిన మురాడి చిత్రం మృతి చెందారు. కొండాపూర్‌కు చెందిన బోయిని గణేశ్, పులిమామిడికి చెందిన మండ్ల రాములు మృతిచెందారు.
వెల్దుర్తి మండలంలోని శెట్టిపల్లి కలాన్ గ్రామానికి చెందిన రైతు పడిగి అంజయ్య (46) పొలం వద్ద బోరుమోటరు స్టార్టర్ సరిచేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఇటీవల మరణించాడు. ఈనెల 12న కొల్చారం మండలం పోతంశెట్టిపల్లికి చెందిన రైతు ముద్దగుల నర్సింహులు (43) కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. ఈనెల 28న కొల్చారం మండలంలోని వసురాం తండాకు చెందిన రైతు మెగావత్ శ్రీను(43) కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. కరెంట్ షాక్‌తో మృతిచెందిన విద్యుత్ శాఖ నుంచి నష్టపరిహారం చెల్లించడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటున్నది. రెండేండ్లుగా బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది.
కేసీఆర్ పాలనలో మెదక్ జిల్లాలో రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ సరఫరా అయ్యింది. కొత్తగానే సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా వ్యవస్థను బీఆర్ఎస్ సర్కారు బలోపేతం చేసింది. దీంతో లోఓల్టేజీ సమస్య తీరింది. వ్యవసాయానికి రాత్రిపూట కరెంట్ సరఫరా బాధ తప్పడంతో బీఆర్ఎస్ హయాంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకున్నారు.
మెదక్ జిల్లాలో 132/కేవీ సబ్స్టేషన్లు 10, 33/11 కేవీ సబ్స్టేషన్లు 125 ఉన్నాయి. మెదక్, తుప్రాన్ విద్యుత్ సబ్ డివిజన్లు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. తుప్రాన్, రామాయంపేట, మెదక్, పాపన్నపేట, నర్సాపూర్ ఏడీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో 1,11,674 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 1,28,739 గృహజ్యోతి కనెక్షన్లు ఉన్నాయి. 2248 పారిశ్రామిక కనెక్షన్లు, 19580 వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి.
యాసంగి వరినాట్లు వేస్తున్నాం. కరెంట్ సరఫరా 24 గంటలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వ్యవసాయ బోర్లుతో పుష్కలంగా నీళ్లు ఉన్నా కరెంట్ లేకపోవడంతో వరినాట్లు వేసే సమయంలో ఇబ్బంది అవుతున్నది. పగలు, రాత్రి వ్యవసాయానికి కరెంట్ సరఫరా చేస్తున్నారు. దీంతో రాత్రి పొలాల వద్దకు పోవాల్సి వస్తున్నది. మాకు ఏమైనా అయితే మా కుటుంబాలను ఎవరు చూసుకుంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కరెంట్ మంచిగా ఇవ్వా లి. వ్యవసాయానికి రాత్రిపూట కరెంట్ బంద్జేయాలి.
– మోతే నాయక్, రైతు, చిట్కుల్ బద్రితండా, (మెదక్ జిల్లా)
కాంగ్రెస్ సర్కారు వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇవ్వాలి. యాసంగి వరి నాట్లు వేస్తున్నాం. ప్రభుత్వం సక్రమంగా కరెంట్ ఇవ్వడం లేదు. దీంతో బోర్లుమోటర్లు తరుచూ ఖాళీపోతున్నా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కరెంట్ షాక్‌లతో రైతులు చనిపోతున్నారు.
– పాతూరు నాందేవ్, రైతు, చండూర్ (మెదక్ జిల్లా)