సంగారెడ్డి, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : పంట రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుకథలు చెబుతున్నదని రైతులు మండిపడుతున్నారు. వందశాతం రుణమాఫీ చేశామని రేవంత్‌రెడ్డి సర్కార్ గొప్పలు చెబుతున్నప్పటికీ సంగారెడ్డి జిల్లాలో పూర్తిగా రుణమాఫీ అమ లు కాలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వం నాలుగో విడత రుణమాఫీ ప్రకటించినప్పటికీ ఇంకా డబ్బులు రైతుల ఖాతాల్లో జమకాలేదు. నవంబర్ 29న కాంగ్రెస్ ప్రభు త్వం నాలుగో విడత రుణమాఫీ ప్రకటించింది. సంగారెడ్డి జిల్లాలో నాలుగో విడతలో 11,301 మంది రైతులకు రూ.110 కోట్ల రుణమాఫీ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రుణమాఫీ ప్రకటించి నెలరోజులు సమీపిస్తున్నా ఇంకా రైతుల ఖాతాల్లో డబ్బులు చేరలేదు. రైతులు నిత్యం వ్యవసాయశాఖ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఖాతాల్లో డబ్బులు జమకాలేదని బ్యాంకర్లు రైతులను తిప్పి పం పుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు సైతం తమ వద్దకు వచ్చిన రైతులను రుణమాఫీ డబ్బులకు సంబంధించిన సమాచారం, రుణమాఫీ అయిన రైతుల జాబి తా తమ వద్దలేదంటూ సమాధానం చెబుతున్నారు. దీంతో తమకు రుణమాఫీ అమలైంది లేనిదీ తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని మాజీమంత్రి హరీశ్‌రావు ఇటీవల సంగారెడ్డి జిల్లా పర్యటనలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సంగారెడ్డి జిల్లాలో రుణమాఫీ అమలుపై మొదటి నుం చి రైతులు అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తామని ప్రకటించింది. ఏకకాలంలో కాకుండా నాలుగు విడతలుగా రుణమాఫీ అమలు చేసింది. అంతేకాకుండా వందశాతం అమలులో విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రప్రభుత్వ పథకం ‘పీఎం కిసాన్ సమ్మాన్’ మార్గదర్శకాలను రుణమాఫీలో అమలు చేయడం, రుణమాఫీకి రేషన్‌కార్డుకు లింకుపెట్టడం, కుటుంబం లో ఒక్కరికే రుణమాఫీ తదితర నిబంధనల కారణంగా సంగారెడ్డి జిల్లాలో సగంమంది రైతులకు రుణమాఫీ వర్తించలేదని రైతులు, రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య సుమారు 1.50 లక్షల నుంచి 2 లక్షలపైన ఉంటారని అంచనా. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు విడతల్లో కేవలం 1,08,867 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తింపజేసింది. ఇంకా రుణమాఫీ వందశాతం అమలు కానప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వందశాతం చేశామని చెప్పుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో మొదటి విడతలో 50,538 మంది రైతులకు రూ.277.73 కోట్లు, రెండో విడతలో 27, 233 మంది రైతులకు రూ.286.93కోట్లు, మూడో విడతలో 19795 మంది రైతులకు రూ.277.74 కోట్ల రుణాలు మాఫీ చేసింది. మొదటి విడతలోనే రైతులు రుణమాఫీ జాబితాలో తమపేర్లు లేకపోవడంపై ఆందోళనకు దిగారు. రెండు, మూడో విడతలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
మరీ ముఖ్యంగా మూడో విడత రుణమాఫీలో జిల్లాలో చాలామందికి రుణమాఫీ వర్తించలేదు. పట్టాదారు పాసుపుస్తకంలో రైతుపేరు సరిగ్గా లేకపోవడం, ఆధార్‌నెంబర్ తప్పుగా ఉండడం, ఒకే ఆధార్‌కార్డుపై ఇద్దరి పేర్లు ఉండడం, రేషన్‌కార్డు లేకపోవడం, రుణాలు రెన్యువల్ చేసుకున్న రైతుల పేర్లు లేకపోవడం తదితర కారణాలతో సంగారెడ్డి జిల్లాలో మూడో విడతలో చాలామంది రైతులకు రూ.2 లక్షల్లోపు పంటరుణమాఫీ కాలేదు. దీంతో ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యవసాయశాఖ ద్వారా గ్రామాల్లో సర్వే నిర్వహించింది. వ్యవసాయశాఖ అధికారులు గ్రామా ల్లో పర్యటించి రుణమాఫీ కానీ రైతుల వివరాలు, పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంకు,ఆధార్‌కార్డు జిరాక్స్ ప్రతులను తీసుకున్నారు. ఏఈవోలు రుణమాఫీ కాని రైతుల ఫొటోలను తీసుకుని ఆన్లైన్ యాప్‌లో అప్లోడ్ చేశా రు. ఈ వివరాలు అందిన తర్వాత ప్రభుత్వం నవంబ ర్ 29న నాలుగో విడత రుణమాఫీ ప్రకటించింది. ప్రభుత్వం నాలుగో విడతలో సంగారెడ్డి జిల్లాలో 11, 301 మంది రైతులకు రూ.110,39,40,083 రుణమాఫీ చేసినట్లు ప్రకటించింది. ప్రకటించి నెల సమీపిస్తున్నా ఇంకా రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. దీనికి తోడు నాలుగో విడతలో రుణమాఫీ వర్తింపజేసిన రైతుల వివరాలను వ్యవసాయశాఖ అధికారులు ఇంకా వెల్లడించలేదు. దీంతో రుణమాఫీ అమలుపై అయోమయం నెలకొంది. రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలుకాని బ్యాంకులు, వ్యవసాయశాఖ అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రుణమా ఫీ అయ్యింది లేనిది చెప్పాలని బ్యాంకర్లను ప్రశ్నించగా, నాలుగో విడత ఇంకా జమ చేయలేదని చెబుతుండడంతో ఏమి చేయాలో దిక్కుతోచక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే పంట రుణమాఫీ చేయాలని కోరుతున్నారు.