ఒకనాడు కరెంట్ కోతలతో అల్లాడిపోయిన రైతులు ఇప్పుడు హాయిగా బతుకుతున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్‌తో దర్జాగా పంటలు పండించుకుంటున్నారు. ప్రశాంతంగా సాగిపోతున్న రైతుల జీవితాల్లో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు గుబులు రేపుతున్నాయి. మూడు గంటల కరెంట్ చాలని, 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో తాము అనుభవించిన విద్యుత్, భూసమస్యలను తలచుకొని కర్షకులు అల్లాడి పోతున్నారు. 24 గంటల కరెంట్ వృథా అంటున్న హస్తం పార్టీకి ఓటేస్తే మళ్లీ కటిక చీకట్లు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు.మరోవైపు, 10 హెచ్‌పీ మోటర్లు పెట్టాలన్న రేవంత్ వ్యాఖ్యలపై విద్యుత్ నిపుణులు తూర్పారబడుతున్నారు. ధరణితో దళారులకు చెక్‌పడింది. స్లాట్ బుక్ చేసుకుంటే నేరుగా తహసీల్ కార్యాలయానికి వెళ్లి సాఫీగా భూముల రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటికి వస్తున్నారు. నేడు ఎక్కడ కూడా భూసమస్యలు కనిపించడం లేదు. కరెంట్ కష్టాలను తీర్చిన కేసీఆర్ వెంటే తామంతా నడుస్తామని, రైతుల నేస్తమైన కారు గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని అన్నదాతలు చెబుతున్నారు.
టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి రైతులపై పూటకో మాట మాట్లాడడం రేవంత్‌రెడ్డికి సరికాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రైతుబంధును ఆరునెలలకో మారు ఇస్తుంటే కావాలనే రైతులను పక్కదారి పట్టిద్దామనే కక్షతో రైతుబంధుపై ఆరోపణలు చేయడం ఇకనైనా మానుకోవాలి. రైతు బంధును కౌలు రైతుకు ఇస్తే భూ యజమానులకు ఇయ్యమనడం సరైన పద్దతి కాదు. ఎవుసం గురించి తెలియని కాంగ్రెసోళ్ల మాటలు నమ్మం.
తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ధరణితో రైతుల భూముల సమస్యలు తీరినయ్. భూ రికార్డులన్నీ శానా భద్రంగా ఉన్నాయి. పాస్‌బుక్కులో నుంచి ఎవరైనా భూమి తీసివేసినా మా ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. వెంటనే అధికారుల దగ్గరికి పోయి అడుగాలే. ధరణి తీసేస్తే దళారుల రాజ్యం వస్తది. సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు తెలిసినోడు. అందుకే 24 గంటల కరెంటు, పంట పెట్టుబడి సాయం రైతుబంధు ఇస్తుండు. కాంగ్రెసోళ్లు రైతులు, కౌలుదారులకు మధ్య విభేదాలు తీసుకురావాలని కుట్రలు చేస్తుండ్రు. ‘ధరణి’వచ్చాకే భూములకు భద్రత, రైతులకు భరోసా వచ్చింది. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్‌ను అధికారంలోకి రా నివ్వం.
రైతులు మంచిగా బతకాలని సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. ధరణిలో రైతు వేలిముద్ర లేనిదే భూమి రిజిస్ట్రేషన్ కావట్లేదు. భూముల భద్రతను సీఎం కేసీఆర్ రైతుకే ఇచ్చాడు. ఇంతమంచిగా పని చేస్తున్న ధరణిని రద్దు చేసి పటేల్, పట్వారీ వ్యవస్థ తీసుకొస్తామంటూ ఇబ్బంది పెట్టే మాటలు చెబుతున్న కాంగ్రెసోళ్లను ఎవరూ నమ్మరు. అందుకే కాంగ్రెసోళ్లకు ఓటెయ్యొద్దు.
సమైక్య పాలనలో అంచాలు ఇస్తే చాలు రాత్రికి రాత్రే రికార్డుల్లో భూ యజమానుల పేర్లు మారేవి. భూ వివాదాలతో రైతులు కోర్టులు, పోలీసు స్టేషన్లు ఎక్కాల్సిన పరిస్థితి. భూ తగాదాలతో హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకున్నయి. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో మొత్తం వ్యవస్థ మంచిగా మారింది. మా భూమి మా సంతకం, వేలిముద్ర పెడితే తప్పా మరొకరి పేరు మీదకు మారకుండా చేశారు. భూ వివాదాలకు తావులేకుండా చేశారు. కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలు విని, వారిని గెలిపిస్తే ధరణిని రద్దు చేసి అవకతవకల పద్ధతిని రైతుల నెత్తిన రుద్దుతారు. మళ్లీ ఘర్షణలు, గొడవలు మొదలవుతాయి. రైతులంతా ఆగమాగం అవుతారు.
ధరణితో భూములకు భద్రత పెరిగి, ధరలు కూడా పెరిగినయి. గతంలో పట్వారులు పట్టా మార్పిడి కోసం ఎంతో ఇబ్బంది పెట్టేవారు. రెండున్న కూడా మూడు రాసి ఇదేంది అంటూ రైతులను గోస పెట్టి లంచాలు తీసుకునేటోళ్లు. వాళ్ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగేవాళ్లం. ఇప్పుడు ఆ గోస లేదు. ధరణితో వేలి ముద్ర పెట్టి పేరు ఎక్కించుకుంటున్నాం. పట్టా మీదికి వేరే వాళ్లు రాకుండా బందోబస్తుగా ఉన్నది. ధరణి మీద నాకు చాలా నమ్మకం ఉన్నది.
సీఎం కేసీఆర్ పరిపాలన చాలా బాగుంది. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. ధరణి అంటే రైతులకు లాభం, ధరణి వల్ల భూమికి భద్రత పెరిగింది. రైతు బంధు అందుతున్నది. కాంగ్రెస్ వస్తే రైతు రోడ్డు పాలవుతాడు. కేసీఆర్ పాలనలో కరెంటు 24 గంటలు వస్తుంది. ఇప్పుడు పగలే పంటలకు నీరు పెడుతున్నాం.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం చేసుకోవడానికి రైతులకు ఉచితంగా 24 గంటల పాటు ఇస్తున్న కరెంట్‌తో ఎవుసం సంతోషంగా చేసుకుంటున్నాం. ఒకప్పటి బీడు భూములు కూడా ఇప్పుడు సాగు భూములుగా మారాయి. అందుకే మళ్లీ బీఆర్ఎస్నే గెలిపించుకుంటాం. బూటకపు మాటలతో రైతులను నిండా ముంచాలని చూస్తున్న రేవంత్‌రెడ్డికి తగిన గుణపాఠం చెబుతాం. సీఎం కేసీఆర్ ఆరునెలలకో మారు రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తుంటే ఓర్వలేక నిస్సహాయ స్థితిలో ఉన్న రేవంత్ ఇలాంటి గారడీ మాటలు మాట్లాడడం మానుకోవాలి. పొరపాటున కాంగ్రెస్ వచ్చిందంటే.. రైతుల బతుకులు ఆగమవుతాయి.
తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటుతో చాలా ప్రాధాన్యత ఉంది. వ్యవసాయ పంటలకు నీరు సరఫరా చేస్తూ పంటలు పండించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రానికే కాక దేశానికి అన్నపూర్ణగా ఆవిర్భవించింది. రాత్రి, పగలు వెలుగులు నిండుతున్నాయి. రాత్రి కూడా నిరంతరం కరెంటు సరఫరాతో సంతోషంగా ఉన్నాం. వ్యాపార, వాణిజ్య, పరిశ్రమ వర్గాలు జీవనోపాధిని కల్పిస్తూ ముందుకెళ్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంధకారమే..
రేవంత్‌రెడ్డి మాటలు నమ్మశక్యంగా లేవు. మల్ల మా కేపీఆర్నే తెచ్చుకుంటం. గతంలో కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సరిగ్గా లేకపోవడంతో రైతులు నానా అవస్థలు పడ్డారు. మాటల గారడితో రైతులను పక్కదారి పట్టిద్దామనుకుంటున్న రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్‌కు రైతులు సరైన బుద్ది చెబుతాం. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే గౌరవంగా బతుకుతున్నాం. తెలంగాణ రైతాంగం అంతా బీఆర్ఎస్ వైపే ఉన్నాం. 24 గంటల కరెంటు ఉండాలంటే.. కేసీఆరే మళ్లీ అధికారంలోకి రావాలి.
తెలంగాణ ప్రభుత్వంలో నిరంతరాయంగా వి ద్యుత్ సరఫరా అవుతున్నది. దీంతో పంటలు పుష్కలంగా పండుతున్నయి. మో టర్లు, ట్రా న్స్ఫార్మర్లు కాలిపోయే పరిస్థితి లేదు. నాణ్యమైన విద్యుత్ ఉచితం గా అందుతున్నది. కాం గ్రెస్ వస్తే 10 హెచ్‌పీ మోటర్లు కొనుగోలు చేయాలి. 3 గంటల సమయంలోనే మోటర్లు నడుపుకోవాలి. దీంతో మా కష్టాలు మళ్లీ మొదటికొస్తాయి.
ఒకప్పుడు కరెంటు లేక అనేక పరిశ్రమలు, దవాఖానలు జనరేటర్‌ను వాడుకుంటూ రోగులు, కొనుగోలు దారులపై అధిక భారం వేస్తూ సంపాదించుకునేవారు. గత పాలకుల హయాంలో డీజిల్, పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయేవి. కాని నేడు 24 గంటల కరెంట్‌తో జనరేటర్ జాడే లేకుండా పోయింది. నిరంతర విద్యుత్‌తో డీజిల్, పెట్రోల్ బాధలు తప్పాయి. కరెంటు పోతే పేదోళ్లు కటిక చీకట్లో మగ్గేవారు.
గతంలో వ్యవసాయానికి కరెంటు ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియని పరిస్థితి. ప్రతి రాత్రింబవళ్లు కరెంటు కోసం కాపలా కాసెటోళ్లం. దీంతో చాలామంది రైతులు రాత్రి పూట కరెంటు పెట్టబోయి చచ్చిపోయారు. ఆ రోజులు మళ్లా వద్దు. కాంగ్రెస్ అంటేనే కుట్రలు, కుతంత్రాలు. వాళ్లకు రైతుల మీద ప్రేమ కాదు వారి పెత్తందారి వ్యవసాయ మీద.
కాంగ్రెస్ పాలనలో కరెంటు, ఇప్పుడు కరెంటు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు బతికుండగా కరెంటు సమస్య తీరుతుందనుకోలే. తెలంగాణ చేస్తున్న మంచి పనిని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నది. 60 ఏండ్ల పాలనలో కరెంటు కష్టాలు, రైతుల ఆత్మహత్య, భూసమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. ఈ విషయాలపై రైతుల వద్దకొచ్చి చర్చించాలి. అప్పుడే కాంగ్రెస్ నిజస్వరూపం తెలుస్తుంది.
పంటలు పండించుకోవడానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్‌రెడ్డి మాట్లాడటం ఎంమంచిగా లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంట్‌తోనే రందీ లేకుండా ఎవుసం చేసుకుంటున్నం. పంటలు పండించుకోవడానికి 3 గంటల కరెంటు సరిపోతుందా? ఇలా అయితే మేము ఎట్ల బతకాలే. 10 హెచ్‌పీ మోటర్లతో ఎవుసం అంటే రైతులు అప్పులు పాలవ్వడం ఖాయం. ఈ మోటర్లు నీళ్లను ఒక్కసారి గుమ్మరించి, తర్వాత నీళ్లు లేకపోతే కాలిపోతయ్. ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంట్‌తోనే రైతులంతా సంతోషంగా ఎవుసం చేసుకుంటున్నాం.
తెలంగాణ ఇస్తున్న 24 గంటల కరెంటు మాకు ఎంతో మేలు చేస్తున్నది. పంటల దిగుబడి బాగా పెరిగింది. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే గ్రామాల్లో రైతుల వద్దకు వచ్చి చూడాలి. ధరణి పోర్టల్ వచ్చిన తరువాత ఎన్నో భూసమస్యలకు పరిష్కారం లభించింది. అదే కాంగ్రెస్ జీర్ణించలేకపోతున్నది.
కరెంటు విషయంలో కాంగ్రెస్ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నది. వ్యవసాయానికి కాంగ్రెస్ ఇచ్చిన కరెంటుతో పంటలు సరిగ్గా పడేవి కావు. రాత్రి పూట కరెంటుతో ఎంతోమంది చనిపోయిన ఘటనలు. ఆ చీకటి రోజులు మాకొద్దు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న కరెంటుతో ఇష్టం వచ్చినప్పుడు పంటలకు నీరుపెట్టి, సమృద్ధిగా పంటలు పండిస్తున్నాం.