మొంథా తుపాను గాయాల నుంచి మెట్ట ప్రాంతమైన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రైతులు కోలుకోవడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే దశలో నీటిపాలు కావడంతో రైతులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. మొంథా తుపాను దెబ్బ నుంచి కోలుకునేందుకు ఎంత ప్రయత్నించినా, దాని గాయాల నుంచి బయట పడటం లేదు. ఒక్కరోజులో కురిసిన వర్షం మెట్ట రైతును నిలువునా ముంచింది. పంట చేతికొచ్చింది ఇక కోసుకుందామని అనుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా వచ్చిన తుపాను రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. వర్షం పడి 14 రోజులు దాటుతున్నా దాని ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. నీటిలో ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు నానాతిప్పలు పడుతున్నారు. పండిన పంట వర్షపు నీటిలో తేలియాడుతూ మొలకెత్తుతుంటే రైతులు బోరున విలపిస్తున్నారు.
హుస్నాబాద్, నవంబర్ 11: అక్టోబర్ 29న మొంథా తుపాను కారణంగా భారీగా కురిసిన వర్షానికి సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ డివిజన్లోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలన్నీ నీట మునిగాయి. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కొన్ని ప్రాంతాల్లో నీట మునిగిన పంటలు తేలిపోయి కోసుకునేందుకు అనువుగా మారగా, మరికొన్ని ప్రాంతాల్లో వరి, పత్తి పంటలు ఇంకా వర్షపు నీటిలోనే ఉన్నాయి.
నాలుగు మండలాల్లోని చెరువులు, కుంటల ఆయకట్టు వ్యవసాయ భూములతో పాటు ఇతర లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు అలాగే నిలిచి ఉండడంతో పంటలను కోసుకునే పరిస్థితి కనబడటం లేదు. కొందరు రైతులు కూలీలను పెట్టి నీటిపై తేలియాడుతున్న వరి గోలుసులను కోయిస్తుండగా, మరికొందరు కూలీలు కూడా లోపలికి వెళ్లే పరిస్థితి లేక కోసుకోలేక పోతున్నారు. దీంతో వర్షపు నీటిలో ఉన్న వరిపంట మొలకలు వస్తోంది. పత్తి చేనుల్లోనూ నీరు తగ్గక పోవడంతో బురదమయమై పత్తి ఏరుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పూసిన పత్తి పంటను అలాగే వదిలేయాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదనతో వ్యక్తం చేశారు.

30శాతం పంటలు వర్షపు నీటిలోనే…
మొంథా తుపానుతో కురిసిన వర్షానికి హుస్నాబాద్ డివిజన్లోని నాలుగు మండలాల్లో రైతులు వేసిన వరి, పత్తి పంటలు దాదాపు 30శాతం ఇంకా వర్షపు నీటిలో ఉన్నాయి. తుపానుతో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో మొత్తం 3,202 ఎకరాల్లో వరి, పత్తి పంట నష్టపోయినట్లు అధికారులు చెబుతున్నారు. 2,678ఎకరాల్లో వరిపంట, 524ఎకరాల్లో పత్తిపంట నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా వేశారు. రెండు పంటలు కలిపి సుమారు 1000 ఎకరాలకు పైగా వర్షపు నీరు, బురద, ఇసుక మేటల్లోనే ఉన్నట్లు బాధిత రైతులు చెబుతున్నారు.
వరిపంటను హార్వెస్టర్ మిషన్లతో కోయలేకపోతున్నారు. కనీసం చైన్ మిషన్లతో కోయడానికి కూడా కొన్ని ప్రాంతాల్లో అనువుగా లేదంటున్నారు. కొందరు రైతులు వరిని తాళ్లతో కట్టి నీటిలో మునగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నీటిలో వరికోసేందుకు, బురదతో పత్తి ఏరేందుకు కూలీలు సైతం ససేమిరా అంటుండడం గమనార్హం. ప్రభుత్వం స్పందించి నీటిలో మునిగిపోయి చేతికిరాకుండా పోయిన పంటలను ప్రత్యేకంగా గుర్తించి ఎక్కువ మొత్తంలో పరిహారం ఇవ్వాలని ఈ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల పాలు కావడం ఖాయమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మూడెకరాల వరిపంట నీళ్లల్లనే ఉన్నది.
మూడెకరాల్లో వరిపంట సాగుచేసిన. వరి కోస్తామనుకున్నప్పుడు భారీ వర్షం పడ్డది. దీంతో నా పంట మొత్తం పన్నెండు రోజులుగా నీళ్లలోనే ఉన్నది. వరి గొలుసులు మొలకెత్తుతున్నయ్. బాయికాడికి పోయి పంటను చూస్తే బాధనిపిస్తున్నది. నీళ్లు తీసేద్దామన్నా పైనుంచి మళ్లీ వస్తున్నయ్. మిషిన్తో గానీ, కూలీలతో గానీ కోసుకునే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వమే మమ్మల్పి ఆదుకోవాలి. -కె.అశోక్, రైతు, చౌటపల్లి, అక్కన్నపేట మండలం (సిద్దిపేట జిల్లా)