కౌడిపల్లి, మార్చి22 : అప్పుల బాధతో ఓ గిరిజన రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కుషన్గడ్డ తండాకు చెందిన పాల్త్య జీవుల (50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సాగు కోసం తన పొలంలో మూడు బోర్లు వేయగా.. నీళ్లు రాక అవన్నీ విఫలమయ్యాయి. దీంతో సాగునీరు సరిపోవడం లేదు.. దీనికితోడు ఎండల కారణంగా పంట మొత్తం ఎండిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జీవుల నిన్న ( ఈ నెల 21న) ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. జీవుల ఇంటికి రాకపోవడంతో అతని కోసం కుటుంబసభ్యులు చుట్టుపక్కల అంతా వెతికారు. కానీ ఎక్కడా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో రాజీపేట అడవిలో వెతగ్గా.. అక్కడ ఓ చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. మృతుడి కుమారుడు హరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపారు.