నర్సాపూర్, ఏప్రిల్ 23: కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని చౌరస్తా వద్ద గురువారం కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎడారిగా ఉన్న తెలంగాణను సస్యశ్యామలం చేయడంకోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూళేశ్వరం ప్రాజెక్టుగా ప్రచారం చేసి కేసీఆర్‌ను మానసికంగా వేధించారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి జరిగిందని పదేపదే చెప్పడం విచాకరమన్నారు. తిరిగి అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నాడని, ఇచ్చిన హామీలు ఇవ్వకుండా ఎలా అధికారంలోకి వస్తాడని ప్రశ్నించారు. కేసీఆర్, హరీశ్‌రావు కడిగిన ముత్యంలా బయటకు వచ్చారన్నారు. హామీలు అమలు చేయాలని కోరితే కాంగ్రెస్ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ ముందుకు తెస్తున్నారన్నారు. ప్రజలు తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చంద్రగౌడ్, చంద్ర శేఖర్, నహీం, సత్యంగౌడ్, శివకుమార్, మన్సూర్, కౌన్సిలర్లు రాజు, మోహిజొద్దీన్, నర్సింహులు, రమణాగౌడ్, రవి,ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు.