జహీరాబాద్, మే 27: కర్ణాటక, మహారాష్ర్ట నుంచి తెలంగాణలోకి నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం ఉండడంతో సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. వానకాలం సీజన్ సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతకు నకిలీ పత్తి విత్తనాల భయం పట్టుకున్నది. గ్రామాల్లో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల బంధువులు షాపులు ఏర్పాటు చేసి పత్తి, సోయా విత్తనాలను అమ్మకాలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు నకిలీ సోయా, పత్తి విత్తనాలు అమ్మకాల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా సోయా, పత్తి, కంది పంటను జహీరాబాద్ డివిజన్లో సాగు చేస్తారు. ఈ ఏడాది పత్తి, సోయా, కంది ధరలు రికార్డు స్థాయిలో క్వింటాకు రూ.10 వేల పైగా పలకడంతో రైతులు వాన కాలం సీజన్లో పత్తి, సోయా,కంది పంటలను సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ శాఖ, జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు నకిలీ విత్తనాల అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
జహీరాబాద్‌లో పత్తి, సోయా, కంది ఎక్కువ…
జహీరాబాద్ డివిజన్లో రైతులు వాన కాలంలో అత్యధికంగా పత్తి, సోయా, కంది పంటలను సాగు చేసేందుకు భూములు సిద్ధం చేశారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకోని వ్యాపారులు నకిలీ విత్తనాల అమ్మకాలు చేసేందుకు భారీగా అక్రమంగా నిల్వలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర నుంచి వ్యాపారులు నకిలీ పత్తి, సోయా, కంది విత్తనాలు తీసుకువచ్చి గత ఏడాది అమ్మకాలు చేశారు. ప్రతి ఏటా భారీ ఎత్తున నకిలీ పత్తి, సోయా, కంది విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకుంటున్నా దందా ఆగడం లేదు. నకిలీ పత్తి విత్తనాలను వ్యాపారులు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా తీసుకువచ్చి అమ్మకాలు చేస్తారు. సోయా విత్తనాలను మహారాష్ర్టా, కర్ణాటక నుంచి వ్యాపారులు తెచ్చి, ఇక్కడ రైతులకు అమ్మకాలు చేస్తారు. వ్యాపారులు ఆకర్షణీయమైన ప్యాకెట్లో విత్తనాలను నింపి గ్రామ గ్రామాలకు వెళ్లి రైతులను బుట్టలోకి వేసుకోని అమ్మకాలు చేస్తున్నారు.
వ్యాపారులు తక్కువ ధర ఎక్కువ దిగుబడి పేరుతో అమ్ముతున్నారు. వ్యాపారులు రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి నకిలీ విత్తనాలు ముట్టచెపుతున్నారు. వ్యాపారుల మాయామటలు నమ్మి రైతులు నష్టపోయిన సంఘటనలు ఉన్నాయి. రైతులకు ప్రభుత్వం జీలుగ, జనుము విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. పొరుగు రాష్ర్టాల నుంచి నకిలీ విత్తనాలు తీసుకవచ్చి అక్రమంగా వ్యాపారులు అమ్మకాలు చేస్తున్నారు. బ్రాండెడ్ విత్తనాల కంపెనీ క్న నాణ్యత గల విత్తనాలను తక్కువ ధరకు ఇస్తున్నామని రైతులను నమ్మంచి మోసం చేస్తున్నారు. మార్కెట్లో వస్తున్న విత్తనాల్లో ఏవి అసలు, ఏవి నకిలీయో తెలియని పరిస్థితి ఉంది. నకిలీ విత్తనాలతోపాటు వ్యాపారులు నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రహస్యంగా తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నారు. వ్యాపారులు ప్యాకింగ్ కవర్లు మార్చి ద్విచక్రవాహనాల ద్వారా రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి అమ్మకాలు చేస్తున్నారు. విత్తనాల కొనుగోలు రైతులకు సమస్యగా మారిపోయింది. వ్యాపారులు ఏ విత్తనాలు ఇస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది.
రైతులకు అందుబాటులో ఎరువులు
జహీరాబాద్ డివిజన్లో రైతులకు కావలసిన ఎరువులు అందుబాటులో ఉంచింది. వాన కాలంలో యూరియా 19831 మెట్రిక్ టన్నులు, డీఏపీ 11017 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 11017మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 2184 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 22035 మెట్రిక్ టన్నులు అవసర ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసి నిల్వలు సిద్ధం చేశారు.
నాసిరకం విత్తనాలపై ఫ్రత్యేక నిఘా
రాష్ట్ర ప్రభుత్వం గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకోని నాసిరకం విత్తనాలను ఎక్కడ కూడా అమ్మకాలు చేయకుండా వ్యవసాయ, పోలీసు, ట్రాన్స్‌ఫోర్స్ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు సమాచారం. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే రైతులు కచ్చితంగా వ్యాపారుల నుంచి విత్తనాలకు, ఎరువులకు సంబంధించిన లాట్ నంబర్లు, కాల పరిమితి వివరాలు బిల్లులతో నమోదు చేయించు కోవాలి. రైతులు కచ్చితంగా లైసెన్స్ కలిగి ఉన్న సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపులో కొనుగోలు చేయాలి.
నాసిరకం విత్తనాలు, ఎరువుల అమ్మకాలపై ప్రత్యేక నిఘా
వాన కాలం సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అమ్మకాలు చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. నాసిరకం విత్తనాలు, ఎరువులను విక్రయించే వారిపై కేసులు నమోదు చేస్తాం. లైసెన్స్డ్ వ్యాపారుల వద్ద విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని రైతులకు విజ్ఞాప్తి. కొనుగోలు చేసిన ప్రతి దానికి రసీద్ చేసుకోవాలి. రైతులు భూమి స్వభావాన్ని బట్టి పంటలకు ఎరువులు వేసుకోవాలి. పరిమితికి మించి ఎరువులు వినియోగించడంతో పంటలకు నష్టాం ఉంటుంది. వాన కాలంలో రైతులు పంట మార్పిడి చేసి అధిక దిగుబడులు సాధించాలి. లైసెన్స్డ్ షాపులో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలి. కచ్చితంగా బిల్లులు తీసుకోవాలి.
-భిక్షపతి, ఏడీఏ, జహీరాబాద్