నర్సాపూర్, ఫిబ్రవరి 4 : నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన అశోక్‌గౌడ్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్ ఆదివారం మాజీ మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైనందున అశోక్‌గౌడ్‌ను మాజీ మంత్రి సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ నాయకుడికి మున్సిపల్ చైర్మన్ పదవి వరించడం ఆనందంగా ఉందన్నారు. కౌన్సిలర్లు కలిసికట్టుగా నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. హరీశ్‌రావును కలిసినవారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, కౌన్సిలర్ రాంచందర్, బీఆర్ఎస్ నాయకులు గోపి, భిక్షపతి, నగేశ్, బాల్‌రెడ్డి, ఆంజనేయులుగౌడ్, దావూద్, జ్ఞానేశ్వర్, సాగర్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్ ఉన్నారు.
వెల్దుర్తి, ఫిబ్రవరి 4 : మాసాయిపేట మండలంలోని రామంతాపూర్తండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో సంత్ సేవాలాల్, జగదాంబమాత విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. ఈ నెల 15 నుంచి నిర్వహిస్తున్న విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలకు హాజరుకావాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి రామంతాపూర్తండా గ్రామస్తులు ఆహ్వాన పత్రికను అందజేసి, ఉత్సవాలకు రావాలని కోరారు. హరీశ్‌రావును కలిసినవారిలో ఎమ్మెల్యే సనీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితోపాటు రామంతాపూర్తండా వాసులు ఉన్నారు.
వెల్దుర్తి, ఫిబ్రవరి 4 : వెల్దుర్తి మండలంలోని శెట్పల్లికలాన్ గ్రామానికి చెందిన కీర్తన తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నది. కీర్తన వైద్యచికిత్సకు సాయం చేయాలని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే స్పందించిన రూ. 1.50 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ పత్రాన్ని కీర్తన కుటుంబసభ్యులకు ఆదివారం తన నివాసంలో అందజేశారు.