సంగారెడ్డి కలెక్టరేట్, మే 5: సంగారెడ్డి జిల్లాలో మహిళా ఆరోగ్య కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య మహిళా, కంటి వెలుగు, ధాన్యం కొనుగోళ్ల పురోగతి తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. ప్రతి మంగళవారం జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా ప్రత్యేకంగా మహిళలకు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి, ఆయా రిఫరల్ కేసులకు జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఆరోగ్య మహిళా కేంద్రాల్లో 2,849 మంది మహిళలను పరీక్షించినట్లు పేర్కొన్నారు. 175 రెఫరల్ కేసులు గుర్తించి, 133 కేసులకు సంబంధించి ప్రభుత్వ జనరల్ దవాఖానలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. మిగతా 42 కేసులకు సంబంధించి ఫాలోఅప్ చేయాలని మెడికల్ అధికారులకు సూచించారు. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో గుర్తించిన రెఫరల్ కేసులను ప్రభుత్వ జనరల్ దవాఖానకు పంపని వైద్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఝరాసంఘం ఆరోగ్య మహిళా కేంద్రంలో ఒక కేసులో బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తించి, సంబంధిత మహిళకు సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ దవాఖానలో క్యాన్సర్ సోకిన బ్రెస్ట్‌ను తొలిగించారన్నారు. తరువాత చికిత్స కోసం ఆ మహిళాను హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానకు తరలించినట్లు తెలిపారు.
18 ఏళ్లు దాటిన వారికి కంటి వెలుగు
జిల్లాలో 18 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ కంటి వెలుగు శిబిరాల్లో పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ నెల 4వ తేదీ నాటికి జిల్లాలో 10,01,266 మందికి రీడింగ్ గ్లాసులు ఇచ్చామన్నారు. 44,448 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసులు అందజేశామన్నారు. ఇదే స్ఫూర్తితో పని చేయాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరగాలి
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరగాలన్నారు. ఆయా అధికారులు సమన్వయంతో పని చేసి ధాన్యం కొనుగోళ్లు సజావుగా పూర్తయ్యేలా చూడాలన్నారు. రైతులు విక్రయించిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా కల్పించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు, సివిల్ సప్లయీస్ సంస్థ డీఏఎమ్ సుగుణబాయి, పౌర సరఫరాల శాఖ అధికారి వనజాత, డాక్టర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.