మెదక్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : ‘కార్యకర్తలు అధైర్యపడొద్దు.. పార్టీ మీకు అండగా ఉంటుంది… చీకటి తర్వాత వెలుగు వస్తుంది… ఓటమి తర్వాత గెలుపు దక్కుతుంది… మెదక్‌లో గులాబీ జెండా ఎగురవేస్తాం.’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వైస్రాయ్ గార్డెన్స్‌లో మెదక్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ను ప్రారంభించడానికి కేసీఆర్ వచ్చినప్పుడు మెదక్ పట్టణానికి రూ.50 కోట్లు, రామాయంపేట మున్సిపాలిటీకి రూ.25 కోట్లు, ఏడుపాయల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల నిధులను కేటాయించారు. ఇప్పుడు ఆ నిధులన్నీవెనక్కి వెళ్లాయని, ఇక్కడున్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడిన వందరోజుల్లో చేస్తామన్న పనులు చేయలేదని, రైతుబంధు ఇవ్వలేదని ఎండగడుతూ రీల్స్ చేసి యువత సోషల్ మీడియాలో పెట్టాలని యువకులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ చర్చ పెట్టాలన్నారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే సరిపోదని రూ.500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ.2500 ఇచ్చినప్పుడే ఆ పథకం పూర్తవుతుందన్నారు. కాంగ్రెస్ మెడలు వంచైనా ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పోరాటం చేస్తామన్నారు. ఆనాడు కేటీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం దావోస్‌కి వెళ్తే దండగ అన్నారు.. ఇప్పుడు మీరు దావోస్‌కి వెళ్తే పండగ అని మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఝూటా మాటలు, అబద్ధం ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీద దాడి మానుకోవాలని, ఆరు గ్యారెంటీల హామీల మీద దృష్టి పెట్టాలని సూచించారు. రైతులకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని, బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే బోనస్, రెండు లక్షల రుణమాఫీ, పింఛన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్చి 17 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తవుతుందని అప్పట్లోగా వారిచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలన్నారు.
దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో దళిత బంధు ప్రవేశ పెట్టి వారి అకౌంట్లో డబ్బులు వేస్తే వాటిని ఫ్రీజ్ చేసి దళితుల ఉసురుపోసుకున్నారని హరీశ్‌రావు అన్నారు. గొల్లకురుమలు కట్టిన డీడీలు తిరిగి ఇవ్వకుండా, గొర్రెలు పంపిణీ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక బాధ్యత, హూందాతనం పెరగాలి కానీ ఆ కుర్చీని కించపరిచే విధంగా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలో గెలిచి ఎనిమిది నెలలైనా 6 గ్యారెంటీలను అమలు చేసే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మార్పు వచ్చిందని.. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్ల్లు కాలుతున్నాయని, వైరింగ్ దుకాణాలు, ఇన్వర్టర్, జనరేటర్ షాపులు అందుబాటులోకి వచ్చాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ ఫైల్ మీద సంతకం పెడతామని, రెండు నెలలైనా అమలు చేయలేదన్నారు. రుణమాఫీ చేయకుండా పార్లమెంట్ ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తారా అని ప్రశ్నించారు. 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు రోజుకు 14 గంటలే ఇస్తుందన్నారు. ఆనాడు రైతులకు రైతుబంధు వేస్తే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఇఫో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్ నియోజకవర్గంలోని పట్టణ, మండలాల పార్టీ అధ్యక్షులు గంగాధర్, అంజాగౌడ్, నాగరాజు, మహేందర్ రెడ్డి, రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎంపీపీలు శేరి నారాయణ రెడ్డి, యమున జయరాంరెడ్డి, సిద్ధిరాములు, చిన్నశంకరంపేట్ జడ్పీటీసీ మాధవి రాజు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
– బీఆర్ఎస్ మెదక్ జిలా ్లఅధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని, ఎవరూ వెనుకడుగు వేయకుండా చిన్న ఆటంకంగా భావించి ముందుకు దూసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు చెప్పిన మాయమాటలు, నెరవేర్చని హామీలు అన్నీ ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితిలో కాంగ్రెస్ లేదన్నారు. రెండు నెలల్లోనే ప్రజలకు ఈ విషయం అర్థమైందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడే రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని, ప్రజలకు మేమున్నామనే భరోసా ఇస్తూ ముందుకు వెళ్లారని గుర్తు చేశారు.