DSP Prasanna Kumar | గ్రామాల్లోని ప్రజలందరూ సమానంగా భావించి పండుగలను సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని, క్షణికావేశంలో తెలిసీ తెలియక ఘర్షణలు పడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు.
ఇవాళ మెదక్ మండలం రాజ్పల్లి గ్రామంలో కొందరు యువకులు ఉగాది పండుగ రోజు గొడవలు పడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయంపై ఆర్డీవో, రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్తోపాటు అధికారులు గ్రామానికి చేరుకొని ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. గతంలో మాదిరిగానే అన్నదమ్ముల్లాగా కలిసిమెలసి పండుగలు జరుపుకోవాలని, ఏదైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు గ్రామ పెద్దలు, పోలీసులు ఉన్నారని, వారి సమక్షంలో సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు.
క్షణికావేశంలో తెలిసీ, తెలియకుండా ఏవైనా పొరపాట్లు జరిగినా వాటిని సామరస్యంగా సర్దుకుపోయే ప్రయత్నం చేయాలన్నారు. ప్రతీ పౌరుడు చట్టం పరిధిలోనే పని చేయాల్సి ఉంటుందని, చట్టాలను అతిక్రమిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా యువకులు చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల గొడవలు పడితే కేసులు నమోదై భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.
రాజీమార్గం వైపు మొగ్గు చూపాలే…
పచ్చని గ్రామాల్లో లేనిపోని గొడవలు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అందుకోసం ప్రతీ ఒక్కరు ఏదైనా తప్పు జరిగితే రాజీమార్గం వైపు మొగ్గు చూపాలే తప్ప దానిని పెద్దగా చేసి కేసులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకురాకపోవడం మంచిదన్నారు. అందుకోసం ప్రతీ ఒక్కరు అందరు కలిసిమెలసి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ మురళి, డిప్యూటీ తహసీల్దార్ మహేందర్, గిర్దావర్ లక్ష్మణ్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
Caste census funds | కుల గణన నిధులు విడుదల చేయాలని కలెక్టర్కు లేఖ
Gas Leak | ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్.. ఫ్యాక్టరీ ఓనర్ మృతి.. 40 మంది ఆస్పత్రిపాలు..!
Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ముగ్గురు మృతి