Gas Leak : ఫ్యాక్టరీ గోదాములో పార్కు చేసిన ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీకైన ఘటనలో ఒకరు మరణించారు. మరో 40 మంది ఆస్పత్రిపాలయ్యారు. రాజస్థాన్‌లోని బీవార్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి తరలించారు. మరింత అనర్థం జరగకుండా గ్యాస్ లీకేజీని కంట్రోల్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ రాష్ట్రం బీవార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బదియా ఏరియాలో సునీల్ ట్రేడింగ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ గోదాములో పార్క్ చేసిన ట్యాంకర్ నుంచి అర్ధరాత్రి నైట్రోజన్ గ్యాస్ లీకవడం మొదలైంది. స్థానికులు గమనించి పోలీసులకు, కంపెనీ ఓనర్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో ముందుగా ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఫ్యాక్టరీ ఓనర్ సునీల్ సింఘాల్ గ్యాస్‌ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. దాని ప్రభావంతో ఊపిరాడక మరణించారు.
ఆ తర్వాత ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిసర నివాసాల్లోని ప్రజలను అక్కడి నుంచి తరలించారు. కానీ అప్పటికే 40 మంది శ్వాస ఆడని స్థితిలో ఆస్పత్రి పాలయ్యారు. అదేవిధంగా ఆ ప్రాంతంలోని పలు పెంపుడు జంతువులు, వీధి కుక్కలు, ఇతర ప్రాణులు మరణించాయి. ప్రస్తుతం పరిస్థితి దాదాపు అదుపులోకి వచ్చిందని, కంపెనీని సీజ్ చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు.