వెల్దుర్తి, డిసెంబర్ 19: అధికారుల తప్పిదంతో పేదలకు పథకాలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నా ఆన్లైన్ నమోదులో అధికారుల తప్పిదంతో నిరుపేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. మెదక్ జిల్లా వెల్దుర్తి పట్టణానికి చెందిన కిచ్చుగారి ప్రమీల భర్త నర్సింహులు పదేండ్ల క్రితం మృతిచెందాడు. అత్తగారి కుటుంబం ఆదరించకపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ ఉన్న ఇద్దరు కూతుళ్ల వివాహాలు చేసింది. కొన్నేండ్ల క్రితం రోడ్డు ప్రమాదం జరగడంతో తీవ్ర గాయాలపాలై చావుబతుకుల నుంచి బయటపడింది.
అనంతరం ఒకే గదిలో ఉంటూ, ప్రభుత్వ పెన్షన్, చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. ప్రభుత్వం ఫిబ్రవరిలో చేపట్టిన ప్రజాపాలనలో గ్యాస్ రాయితీ, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు రసీదులో సైతం వాటి వివరాలను నమోదు చేయగా, దరఖాస్తును పరిశీలించిన అధికారు లు ప్రజాపాలన రసీదును ప్రమీలకు అందజేశారు. అనంతరం దరఖాస్తుల ఆన్లైన్ నమోదులో ఆపరేటర్లు, పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ప్రమీల దరఖాస్తు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయలేదు.
దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వర్తించలేదు. ప్రతినెలా కరెంట్ బిల్లు చెల్లిస్తుండగా, గ్యాస్ రాయితీ రావడం లేదు. ఇందిరమ్మ ఇంటి సర్వేలో సైతం పేరు రాలేదు. ప్రభుత్వ పథకాలకు అన్ని అర్హతలు ఉన్నా అధికారుల తప్పిదంతో రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేసి పథకాలను వర్తింపచేయాలని ప్రమీల విజ్ఞప్తి చేశారు.