సంగారెడ్డి జూలై 28(నమస్తే తెలంగాణ): జిల్లాలో కుండపోత వర్షంతో వాగులు పొంగుతున్నా ఎక్కడా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. వాతావరణశాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యే ఉండేలా ఆదేశాలిచ్చారు. ప్రతిరోజు కలెక్టర్ శరత్ సహా అధికారులు, ఎమ్మెల్యేలతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. వర్షం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశిస్తున్నారు. వర్షాలతో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, పట్టణాలు, గ్రామాల్లో వందశాతం పారిశుధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సాధారణం కంటే అధికవర్షపాతం నమోదు
వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో ఈనెలలో 174.4 మి.మీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా 430.1 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 146.6 శాతం అధికంగా కురిసింది. సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదైంది. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా కలెక్టర్ శరత్ చర్యలు తీసుకున్నారు. జిల్లా, మండల స్థాయిలో అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్, డీఎంహెచ్ఓ, ఇరిగేషన్ కార్యాలయాల్లో కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. ప్రజారవాణాకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టారు. వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న చోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రహదారులపై కల్వర్టులు, వంతెలు దెబ్బతిన్నచోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. నాని ఇళ్లు కూలిపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అంతటా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ శరత్ స్వయంగా పలు మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. జహీరాబాద్ పట్టణంలో నీట మునిగిన వసంత్ విహార్ కాలనీని సందర్శించారు. కాలనీ నుంచి నీళ్లు వెళ్లేలా తక్షణ చర్యలు చేపట్టారు. వర్షాలతో వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. పంచాయతీ, మున్సిపల్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి వందశాతం పారిశుధ్య పనులు జరిగేలా చూశారు. అనారోగ్యంతో ప్రజలు ప్రభుత్వ దవాఖానలకు వస్తే వెంటనే వైద్యం అందేలా చర్యలు చేపట్టారు.
పక్షికంగా దెబ్బతిన్న 310 ఇండ్లు
వర్షాలతో జిల్లాలో ఎక్కడా ప్రాణనష్టం, పెద్దగా ఆస్తినష్టం చోటు చేసుకోలేదు. 310 ఇండ్లు పాక్షికంగా దెబ్బతినగా 20 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి. 10 కిలోమీటర్ల మేర రహదారులు, 20 చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. 800 ఎకరాలకుపైగా పంటలు నీట మునిగాయి. ఎక్కువగా పత్తి, కంది, పెసర, మినుము, చెరుకు, సోయా పంటలు నీట మునిగాయి. ఝరాసంగం మండలం, కోహీర్ మండలంలో పలు వాగులు పొంగి ప్రవహించాయి.
నిండుకుండలా సింగూరు
పుల్కల్, జూలై 28: సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో వరద నిలకడగా కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి పదిహేను రోజులుగా వస్తున్న వరద శుక్రవారంతో తగ్గింది. గురువారం సాయంత్రానికి ప్రాజక్టులోకి 25,607 క్యూసెక్కులు రాగా, శుక్రవారం సాయంత్రం 6.00 గంటల సమయానికి 14,546 క్యూసెక్కు వచ్చిందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి నీటి ప్రవాహం రీడింగ్ తీస్తున్నారు. ఏక్షణంలో అయినా వరద ప్రవాహం పెరగొచ్చని ప్రాజెక్టు వద్దే ఉంటూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. సందర్శకుల తాకిడి పెరుగుతుండటంతో అధికారులు ప్రాజెక్టు వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టుపైకి ఎవరినీ అనుమతించడం లేదు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 24.274 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి వస్తున్న వరద 14,546 క్యూసెక్కులు కొనసాగుతుండగా, 235 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు ప్రాజెక్టు డిప్యూటీ డీఈ నాగరాజు తెలిపారు.
జోరు వానలో జనం మధ్యలో ఎమ్మెల్యేలు
భారీ వర్షాలు కురుస్తున్నా ఎమ్మెల్యేలు ప్రజలు మధ్యలో ఉండి వారికి అండగా నిలిచారు. ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సూచనల మేరకు జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. మూడు రోజుల ముందువరకు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పటాన్చెరు, రామచంద్రాపురం మండలాల్లో పర్యటించి ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. లోతట్టుప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి వారికి సహాయం అందేలా చూశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు వర్షాలు కురిసినా ప్రజల మధ్యలోనే ఉన్నారు. జహీరాబాద్ పట్టణంతోపాటు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అండగా నిలిచారు. అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ వర్షంలోనూ నియోజకవర్గంలో పర్యటించారు. మునిపల్లి, అందోలు, రాయికోడ్ మండలాల్లో ఇండ్లు కూలిపోయిన బాధితులతో స్వయంగా మాట్లాడి ఆదుకున్నారు. అధికారులతో సమీక్ష జరిపి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు. రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు వర్షాలతో ఇబ్బందులు పడకుండా చూశారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజలు, రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు.