అమీన్పూర్(జిన్నారం), ఏప్రిల్ 1 : ప్రభుత్వ, శిఖం భూములను పరిరక్షించడంలో రెవెన్యూ, ఇరిగేషన్శాఖల అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. భూములు ఆక్రమణకు గూరవుతున్నా స్పందించడం లేదు. దీంతో అక్రమ నిర్మాణాలు అరికట్టాలని స్థానికులు హైడ్రాను ఆశ్రయిస్తున్నారు. తప్పేది లేక హైడ్రా అధికారులు రంగంలోకి దిగాల్సి వస్తున్నది. హైడ్రా అధికారులు ఆదేశిస్తే తప్పా స్థానిక అధికారులు ముందుకు సాగడం లేదు. స్థానిక అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమీన్‌ఫూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని భూముల ధరలు కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రైవేట్ భూముల్లో దాదాపు నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూము లు ఆక్రమించే పనిలో అక్రమార్కులు ఉన్నారు. నిత్యం ఏదో ఒక కాలనీలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి.
రాత్రికి రాత్రే అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. అమీన్‌పూర్‌లోని 673, 993, 1112, 823 తదితర సర్వేనంబర్లలోని ప్రభుత్వ భూ ములు కబ్జాకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూము లు రక్షించాల్సిన రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. స్థానికంగా ఉన్న కొంతమంది నేతల కనుసన్నల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

అక్రమ నిర్మాణాలపై అధికారులు నామమాత్రపు కూల్చివేతలు జరిపి చేతులు దులుపుకొంటున్నారు. ప్రభుత్వ భూ ములతో పాటు శిఖం భూ ములు ఎక్కువగా ఆక్రమణకు గురవుతున్నాయి. స్థానికంగా ఉన్న శిఖం కుంట ను ఆక్రమిస్తూ భారీగా నిర్మాణాలు జరిగాయి. ఈ నిర్మాణాలను తొలిగించడంలో ఇరిగేషన్‌శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కబ్జాదారులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నా యి.
రెవెనూ, ఇరిగేషన్శాఖల అధికారులు ఆక్రమణలపై స్పందించకపోవడంతో స్థానికులు హైడ్రా అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల హైడ్రా కమిషనర రంగనాథ్ అమీన్పూర్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పరిశీలించారు. కబ్జాకు గురవుతున్న శిఖం భూము లు, నిర్మాణాలను స్వయంగా తెలుసుకున్నారు. స్థానిక రెవెన్యూ అధికారుల తీరుపై హైడ్రా కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. హైడ్రా అధికారుల ఆదేశాలతో తర్వాత రోజే సుమారు 50 అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు. హై డ్రా అధికారులు వస్తేనే ఆక్రమణలపై చర్యలు తీసుకుంటారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ, శిఖం భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు అరికట్టేందుకు చర్య లు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.