మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్ 1: గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులకు జీవనోపాధిని కల్పించాలనే సదుద్దేశంతో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ సంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో 2021లో గ్రామీణ సంత(షాపింగ్ కాంప్లెక్స్) నిర్మాణానికి ఈజీఎస్ కింద రూ. 10లక్షలు మంజూరు చేసింది. ఈజీఎస్ నిధులకు తోడుగా స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ నిధుల నుంచి రూ. 10లక్షలు, గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ. 5లక్షలు ఖర్చు చేయాలని ప్రతిపాదనలు సిద్ధ్దం చేశారు.
మొత్తం రూ.25లక్షల నిధుల ప్రతిపాదనలతో అప్పటి గ్రామ సర్పంచ్ కంఠారెడ్డి జనార్దన్‌రెడ్డి నిర్మాణ పనులు చేపట్టారు. సుమారు రూ. 15లక్షల వరకు నిర్మాణ పనులకు ఖర్చు చేశారు. ఈజీఎస్ నుంచి మాత్రమే అధికారికంగా నిధులు మంజూరయ్యాయి. మిగతా ఎమ్మెల్యే, కలెక్టర్, గ్రామ పంచాయతీ నిధులు మంజూరు కాకపోవడంతో పాటు ఈజీఎస్ నిధులు పూర్తిగా రాకపోవడంతో సర్పంచ్ గ్రామీణ సంత నిర్మాణ పనులు మధ్యలోనే నిలిపివేశారు. అదనపు నిధుల కోసం ప్రభుత్వంలోని పెద్దలను కలిసిన ప్రయోజనం లేకపోవడంతో సంత నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు.
మద్దూరు మండల కేంద్రంలో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేందుకు షాపులు లేకపోవడంతో ఆరుబయట, కిరాయి షాపుల్లో తమ వ్యాపారాలు చేసుకుంటూ చిరువ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేస్తే వీరికి ఎంతో మేలు జరుగుతుంది. దీనికి తోడు గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతుంది. ప్రభుత్వం నిలిచిపోయిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు వెంటనే నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
జీవనోపాధి కోసం తమ కుల వృత్తి అయిన డ్రైక్లీనింగ్, లాండ్రీ పనిచేస్తున్నాను. దీనికోసం ఓ అద్దె షాపును కిరాయికి తీసుకున్నా. ఊరిలో పనిదొరికేదే అంతంతమాత్రంగా ఉంటే కిరాయి మాత్రం నెలనెలా కట్టాల్సి వస్తున్నది. కిరాయి కట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు తొందరగా పూర్తి చేస్తే నాలాంటి చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు ఎంతో మేలు జరుగుతుంది.
– పిడిశెట్టి రాజు, ల్యాండ్రీ షాపు నిర్వాహకుడు, మద్దూరు
మద్దూరులో చేపట్టిన గ్రామీణ సంత(షాపింగ్ కాంప్లెక్స్) నిర్మాణ పనులు నిధులు లేక ఆగిపోయాయి. అందుబాటులో ఉన్న ఈజీఎస్ నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు చేశాం. అదనంగా కావాల్సిన నిధుల కోసం వివిధ మార్గాలను అన్వేసిస్తున్నాం. 15వ ఆర్థ్ధిక సంఘం నిధులు విడుదలైతే ఈ నిర్మాణ పనులకు వాటిని వెచ్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నిధులు సమీకరించి, నిర్మాణ పనులపు పూర్తి చేసేందుకు కృషి చేస్తాం.
– సోమిశెట్టి రామ్మోహన్, ఎంపీడీవో మద్దూరు