సిద్దిపేట అర్బన్, మార్చి 19 : ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వహించాలని.. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని సిద్దిపేట పోలీస్ కమిషనర్ బి.అనురాధ అన్నారు. మంగళవారం పోలీస్ కమిషనరేట్లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులు, విధానాలు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, పటిష్టబందోబస్తు, క్రిటికల్, నార్మల్ పోలింగ్ కేంద్రాలు తదితర వాటిపై పోలీస్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు.
పోలీస్స్టేషన్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. రాజకీయ నాయకులు నిర్వహించే సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారంపై నిఘా ఉంచాలని సూచించారు. ఓటరును మభ్యపెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఎన్నికల సందర్భంగా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినా, డబ్బులు పంచినా, ఓటర్లను మభ్యపెట్టినా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1950కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని సూచించారు. సోష ల్ మీడియా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటి పై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ ఎస్.మల్లారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీలు రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు మధు, పురుషోత్తంరెడ్డి, సతీశ్, సుమన్ కుమార్, రవీందర్, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.