సిద్దిపేట, మే 29: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జూన్ 4 నుంచి 6 వరకు జరగనున్న కిసాన్ మేళాకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులకు సూచించారు గురువారం సిద్దపేట ఐడీఓసీలోని సమావేశ మందిరంలో కిసాన్మేళా ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుస్నాబాద్ మారెట్ కమిటీలో నిర్వహించనున్న కిసాన్‌మేళాలో దాదాపు 130 స్టాళ్ల వరకు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రతి విభాగాన్ని పర్యవేక్షిస్తూ రైతులకు అవగాహన కల్పించడంతో పాటు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులను బృందాలుగా నియమించినట్లు తెలిపారు. స్టాల్ ఏర్పాటుకు ఏదైనా సంస్థ సిబ్బంది హాజరు కావడం లేదని నిర్ధారణ జరిగితే దాని స్థానంలో మరొకటి ఏర్పాటు చేస్తామన్నారు. కిసాన్‌మేళాలో నూతన వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం గురించి రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.
రైతులకు అవసరమైతే బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చేవారి కోసం భోజనం, తాగునీటి ఏర్పాట్లు చేయాలన్నారు. సిద్దిపేట అదనపు కలెక్టర్లు గరిమాఅగర్వాల్, అబ్దుల్ హమీద్, సిద్దిపేట జిల్లా వ్యవసాయాధికారి రాధిక, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.