సిద్దిపేట టౌన్, జూన్ 8: సిద్దిపేట జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సుల సామర్థ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. రవాణాశాఖ జీవో నెంబర్ 35 ప్రకారం పాఠశాలలు, కళాశాలల బస్సులు నిబంధనలు పాటిస్తే వాటికి అనుమతులు లభిస్తాయి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా రోడ్డుపై తిరిగేందుకు అనుమతి ఉండదు. సిద్దిపేట జిల్లాలో 372 బస్సులు ఉన్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికి వరకు రవాణా శాఖ అధికారులు 160 వాహనాలను తనిఖీ చేశారు. 212 బస్సుల సామర్థ్యాన్ని తనిఖీ చేయాల్సి ఉంది. ఈ పూర్తి ప్రక్రియ ఆన్లైన్లో సాగనుంది.
విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత 15 రోజుల వరకు సామర్థ్య పరీక్షలను పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో సామర్థ్య పరీక్షల నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు, తదితర అంశాలపై కథనం…బడి బస్సులు ఫిట్‌గా ఉంటేనే విద్యార్థులు సురక్షితంగా ఇంటికి వెళ్తారు. పాఠశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా రవాణాశాఖ అధికారులు బడి బస్సులకు సామర్థ్య పరీక్షలను నిర్వహించి అనుమతులు ఇస్తారు. ఇందులోభాగంగా ఈ ఏడాది సామర్థ్య పరీక్షలను ముందుగానే అధికారులు ప్రారంభించారు.
ఒకప్పుడు సిద్దిపేటలో మాత్రమే బస్సుల ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేది. మూడేండ్లుగా గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్ ఎంవీఐ కార్యాలయాల్లో ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. దీంతో స్థానికంగా ఉండే ప్రైవేటు పాఠశాలలకు ఉపయుక్తంగా మారింది. నాలుగు చోట్ల కార్యాలయాలు వికేంద్రీకరణ కావడంతో అధికారులు కూడా మరింత నిఘా పెట్టేందుకు అవకాశం కలిగింది. నిర్ధేశిత ముగియగానే సామర్థ్యం, ధ్రువీకరణ పత్రాలు లేకపోతే అధికారులు కొరఢా ఝులిపించవచ్చు. పాఠశాల యాజమాన్యాలు దళారులను నమ్మి మోసపోవద్దు.
పిల్లలను బడిలో చేర్పించామని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నీ దగ్గరుండి పాఠశాల వారే చూసుకుంటారని చేతులు దులుపుకుంటే సరిపోదు. పాఠశాలకు సంబంధించిన అన్నింటిపైన తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలి. బడి బస్సు ఫిట్నెస్, బస్సులోని లోపాలు, పరిమితికి మించిన పిల్లలను ఎక్కించుకునే వాటిపైన, వేగంగా బస్సులను నడపేతే అలాంటి వాటిపైన ఎప్పటికప్పుడు ఆరా తీయాలి.. లోపాలను పాఠశాల యాజమన్యాలకు ఫిర్యాదు చేయాలి.
పాఠశాల బస్సులు 15 ఏండ్ల కాలపరిమితిని మించకూడదు. వాహనం ముందు, వెనుక బడి పిల్లల చిత్రాలను స్పష్టంగా పెద్దగా వేయాలి. కిటికీకి అడ్డంగా మూడు కడ్డీలను ఉంచాలి. ఇంజిన్, క్లచ్ గేర్ పూర్తి సామర్థ్యం కలిగి ఉండాలి. ప్రథమ చికిత్స, అగ్ని ప్రమా దం జరిగినప్పుడు మంటలు ఆర్పివేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. బస్సులో ప్రధానంగా ప్రత్యేక ద్వారం తప్పనిసరిగా ఉండాలి. సైడ్లకు బస్సు రేడియం, స్టిక్కర్ ముందు తెలుపు, వెనుక ఎరుపు స్టిక్కర్లను అతికించాలి. వాహనం ఆగితే బ్లింక్ అయ్యేలా పైభాగం నాలుగు వైపుల అంబర్ లైట్లు ఉండాలి.
పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన వాహనాలకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తాం. ఈ ఏడాది మరింత పక్కాగా పరీక్షలు జరుపుతున్నాం. ఇప్పటికే పాఠశాల యాజమాన్యాలకు, వాహన డ్రైవర్లకు నిబంధనలపై అవగాహన కల్పించాం. అనుమతులు పొందకుండా పాఠశాల బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఈనెల 15 నుంచి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తాం. నిబంధనలు పాటించని పాఠశాల బస్సులను తనిఖీ చేసి పట్టుబడిన వాటిని అక్కడికక్కడే సీజ్ చేస్తాం. – శంకర్ నారాయణ, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్, సిద్దిపేట జిల్లా