Agriculture | వర్గల్, ఫిబ్రవరి 28: ఉపాయం ఉండాలే కానీ, ఉపాసం ఎవ్వరుండరు… అనే సామెత నూటికి నూరు పాళ్లూ నిజం. ‘పదుల కొద్ది ఎకరాలు లేకున్నా, పంట దిగుబడిని ఎలా రాబట్టాలో తెలిస్తే ఆ ఇంటి గోదలయినా, మనుషులయినా పస్తులుండే పరిస్థితి రాదు’ అంటారు పెద్దలు! వర్గల్ మండలం సింగాయిపల్లి గ్రామానికి రైతు నల్ల రవీందర్‌రెడ్డి సరిగ్గా ఇదే కోవకు చెందిన రైతు అని చెప్పవచ్చు. రవీందర్‌రెడ్డి తనకున్న రెండెకరాల్లో ఒక ఎకరంలో పందిరి పద్ధతిలో ఉద్యాన పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సొరకాయ తదతర తీగ తోటలను పండిస్తూ మరో ఎకరంలో వరిసాగు చేస్తున్నాడు. ఏడాది పొడవునా ఏదో ఒక కూరగాయ పంట వేస్తూ కాసులకు, ఖర్చులకు కష్టం లేకుండా బతుకుతున్నాడు. ఉపాయం ఉండాలే గానీ ఉల్లిగడ్డంత పొలం లో పుట్లు పండిస్తారు అన్నట్లు ఈ రైతు నలుగురికి మార్గదర్శిగా నిలుస్తున్నాడు.
వానకాలం వస్తేనే దుక్కుల్లో పొదలు, పొర్కలు చదును చేసుకొనే రైతు రవీందర్‌రెడ్డి తనకున్న ఖుష్కి పొలంలో బోరుబావి వేశాడు. కొద్దో గొప్పో నీళ్లుపడ్డాయి. ఆ తర్వాత ఏడాది పొడవునా కూరగాయలు సాగు చేసేందుకు పందిరి తీగ కోసం 2 వందల రాతి కడీలు తెప్పించాడు. ఒక్కో కడికి రూ.650. కడీలు పాతడానికి అదనంగా మరో ఖర్చు. ఎకరా పందిరి తీగకు రూ.2 వేల వరకు సొర విత్తనాలు, డీసీఎం కోడి ఎరువుకు రూ.10 వేలు, డ్రిప్పు పైపులైన్‌కు మరో ఖర్చు.. ఇలా మొత్తం పందిరి తీగ సాగుకు రూ.3 లక్షల 50 వేల వరకు ఖర్చు వచ్చింది. కాపు బాగానే కాసింది. మార్కెట్లో రేటు కూడా కలిసి రావడంతో రైతుకు లాభంతోపాటు తొలి పంటతోనే చేసిన అప్పులు తీర్చే మార్గం కనబడంతో రైతులో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది.
పందిరి తీగ వేయక ముందు చిట్టీలు నడిపిస్తూ ఉండేవాణ్ని. జాగ ఉండి కూడా నీళ్లు లేకపోడంతో కొంతకాలం కౌలుకు తీసుకొని ఎవుసం చేసిన. పరాయి భూమిని నమ్ముకొని ఎన్నేండ్లు బతకాలని నాలో నేను చాలా సార్లు ఆలోచన చేసేవాణ్ని. అప్పోసొప్పో చేసి సొంత జాగాలో బోరుబావి, పందిరి తీగ, డ్రిప్ పైపులైన్ వేసిన. దేవుడి దయవల్ల ఎవుసం బాగానే కలిసొచ్చింది. ఒక్కో కాయకు రూ.14 వస్తుంది. పండించిన కూరగాయలకు మార్కెట్లో రేటు అనుకున్నట్లుగా వస్తే ప్రతి రైతుకు వ్యవసాయం పండుగే అవుతుంది.
– నల్ల రవీదంర్‌రెడ్డి, రైతు (సింగాయిపల్లి గ్రామం, వర్గల్ మండలం)