హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై ఉన్న రెండు క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. తుది తీర్పు వెలువరించేలోగా కింది కోర్టులో వాటి విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వు లు ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
పోలీసుల వాదనలు వినకుండా తాము మధ్యంతర ఆదేశాలను జారీ చేయబోమని స్పష్టం చేసింది. బీ ఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై రేవంత్ తీవ్ర ఆరోపణలు చేయడంతో మొగుళ్లపల్లి, భూపాలపల్లి పోలీసుస్టేషన్లలో 2023లో రెండు క్రిమినల్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీటిని కొట్టివేయాలని రేవంత్‌రెడ్డి వేర్వేరుగా రెండు వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కే సుజన గురువారం విచారణ జరిపారు. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.