గజ్వేల్, ఫిబ్రవరి 5: రేవంత్‌రెడ్డి జూటా మాటలకు రెండేండ్లలోనే తెలంగాణ ఆగమైందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. త్యాగాలతో సాధించుకున్న స్వారాష్ర్టాన్ని సర్వనాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టి వారిని ముంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని దుయ్యబట్టారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని బీడీ కాలనీల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.
ఆడబిడ్డల పెండ్లికి తులం బంగారం ఇస్తామన్న రేవంత్ పాలనలో మాత్రం బంగారం ధర పెరిగిందని అన్నారు. ఎన్నికలప్పుడు ఎంతో ఆశ పెట్టిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఏం చేస్త్తలేడని దుయ్యబట్టారు. ఏది ఏమైనా మరో రెండేండ్లు అయితే మళ్లీ కేసీఆరే వస్తారని తెలిపారు. రేవంత్‌రెడ్డి హార్వర్డ్ పోయినా.. అంతరిక్షం పోయినా తీరుమారలేదని అన్నారు. రైతుబంధు డబ్బులు ఎన్నికల తరువాత ఇస్తామని రేవంత్‌రెడ్డి జూటా మాటలు మాట్లాడుతుండని మండిపడ్డారు. దమ్ముంటే ఈనెల 11వ తేదీలోపు రైతుబంధు ఇవ్వకపోతే ప్రజలు, రైతులు రేవంత్‌రెడ్డిని చీరి చింతకు కడ్తారని హెచ్చరించారు.
రేవంత్‌కు దమ్ముంటే కేసీఆర్ పదేండ్ల కాలంలో చేసిన పనిలో పోటీ పడాలని సూచించారు. కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం వస్తే తులం బంగారం, కల్యాణలక్ష్మి ఇస్తేనే ఓట్లు వేస్తామని చెప్పాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే రేవంత్‌రెడ్డి కండ్లు నెత్తికెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నడని మండిపడ్డారు. అసలు ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా అని ప్రశ్నించారు. బూతులు మాట్లాడటం తప్ప రెండేండ్లలో రూపాయి పని కూడాచేయని రేవంత్‌రెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి రాధాకృష్ణశర్మ, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.