మహానగరంలో ప్రతీ నెల 25వేల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఇది నగర ఆరోగ్య భవిష్యత్‌ను ప్రశ్నించే అంశం. ఎందుకంటే వాహనాల పొలూష్యన్ నగర మొత్తం కాలుష్యంలో సగం వాటా ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కాలుష్య కట్టడికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతూనే.. మరోవైపు సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలకు అనుమతులివ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఉన్న వాహనాలతోనే కాలుష్యం ఊపిరాడనివ్వడం లేదు.
అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చే వాహనాలన్నీ ఈవీలుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రవాణా శాఖ ఇటీవల 20 వేల సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే ఈ తరహా ఆటోల కాలుష్యం తక్కువగా నమోదైనప్పటికీ పూర్తిస్థాయి పరిష్కారం మాత్రం కాదని నిపుణులు చెబుతున్నారు. వాటి నుంచి కూడా ప్రమాదకర వాయువులు విడుదలవుతాయని నివేదికలు అందించారు. కాగా, సీఎన్జీ గ్యాస్ కొరత కారణంగా గ్రేటర్లో రిట్రోఫిట్మెంట్తో పెట్రోల్, డీజిల్ ఆటోలుగా రూపాంతరం చేస్తున్నారు.
-సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 ( నమస్తే తెలంగాణ )
సగం వాటా వాహనాలదే..!
మహానగరంలో వెలువడే మొత్తం కాలుష్యంలో వాహనాల నుంచి వెలువడే కాలుష్యం 30-40 శాతం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యాన్ని కట్టడి చేయాలని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ దిశగా అడుగులు వేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చొరవ చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొత్తగా ఆటో పర్మిట్లను రవాణా శాఖ జారీ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. నగరంలో ఇప్పటికే అనధికారికంగా 1.20 లక్షల ఆటోలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
ఒకే నెంబర్‌పై రెండు, మూడు ఆటోలు అనధికారికంగా తిరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఆటోలకు పర్మిట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కొత్త ఆటోలు వస్తే అవన్నీ ఎలక్ట్రిక్ ఆటోలే ఉండేలా అనుమతులు జారీ చేస్తే కాలుష్యం తగ్గేది. కానీ అందులో 20వేల సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలను కూడా చేర్చడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సీఎన్జీ వాహనాలతోనూ పర్యావరణం ప్రమాదంలో పడే అవకాశం ఉందని పర్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. సీఎన్జీ వాహనాలతో కార్బన్ డై ఆక్సైడ్(సీఓ2) విడుదల అవుతుంది. మీథేన్ లికేజీ జరిగితే గ్రీన్ హౌస్ ప్రభావం ఉంటుంది. పాత ఇంజన్లు, సరైన నిర్వహణ లేకపోతే కాలుష్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
పోటా పోటీ..!
కాలుష్యంతో సంబంధం లేకుండా చాలా మంది ఆటో కొనుగోలు చేయడానికి సీఎన్జీ, ఎల్పీజీలనే ఎంచుకుంటున్నారు. భవిష్యత్‌లో పెట్రోల్, డీజిల్‌గా మార్చుకునే అవకాశం ఉంటుందనే కారణంతో ఆ ఆటోలపై షోరూంలు అనధికారికంగా ఎంత ధర చెప్పినా.. ఫైనాన్స్‌తో ఆ ఆటోలను కొనుగోలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆ ఆటోలన్నీ ఆటో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికే దక్కాలి. కానీ సగానికి పైగా ఆ ఆటోల ఓనర్లు ఆటో నడపే వాళ్లు కాకపోవడం గమనార్హం. ఒక్క సీఎన్జీ ఆటో రూ. 3.70 లక్షల ధర పలుకుతుందని ఆటో డైవర్ రాజు తెలిపాడు. ఇన్వాయిస్తో సంబంధం లేకుండా డబ్బులు అప్పజెబితేనే ఆటో వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దశలో మరో 2వేల సీఎన్జీ ఆటోలు రావాల్సి ఉంది. వాటిని సైతం వేలం పాట పాడినట్టుగా అత్యధిక ధరకు విక్రయించడానికి షోరూంలు రెడీ అయ్యాయి.
పరిమితికి మించి ..
నగరంలో నమోదవుతున్న కాలుష్యాన్ని పరిశీలిస్తే మోస్తరు నుంచి తీవ్రమైన కాలుష్యం నమోదవుతుంది. కొన్ని పరిస్థితుల్లో పీఎం2.5 పరిమితికి మించి 3-4 రెట్లు ఎక్కువగా నమోదవుతున్నది. పీఎం2.5 సూక్ష్మ కణాలు నేరుగా ఊపిరితిత్తులోకి వెళ్లి ఆస్తమా, బ్రాంకైటిస్, గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పోలిస్తే ఈవీ వాహనాల వినియోగం మంచిది.శబ్ధ కాలుష్యం తగ్గుతుంది. ఇంధన దిగుమతులపై ఆధారిత వ్యయం తగ్గుతుంది. నగరవాసుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.