సిద్దిపేట, జూన్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. మిల్లర్లు, అధికారులు కలిసి రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. ధాన్యం విక్రయించి నెల రోజులు అవుతున్నా డబ్బులు మాత్రం ఇంతవరకు రైతుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లో జమ కాలేదు. ఎందుకు ఆలస్యమవుతుంది అని అడిగితే మీ దిక్కున్న చోట చెప్పుకోండి..మేం వేసేటప్పుడే వేస్తాం అంటూ రైతులను కొంతమంది మిల్లర్లు బెదిరిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. ఫోన్ చేసినా లిప్టు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై లారీలు లోడింగ్ సమయంలో ఒకటి రాస్తారు. మిల్లుల వద్ద దిగుమతి చేసుకునేటప్పుడు మరోటి రాసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఫలితంగా రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. కొనుగోలు సమయంలో అకాల వర్షంతో ధాన్యం కొంత తడవడంతో తడిసిన ధాన్యం, మంచి ధాన్యానికి ఒక్కదాని కింద లెక్క కట్టి ట్రక్ షీట్ రాస్తున్నారు. గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ అని రెండు రకాలుగా ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు.
మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలం మద్దులవాయి (ముత్తాయికోట) గ్రామానికి చెందిన ఎనిమిది మంది రైతులు గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి మే మాసంలో ధాన్యాన్ని తీసుకొచ్చారు. 709 బస్తాల (283 క్వింటాళ్ల 60 కిలోలు) ధాన్యాన్ని మే 12వ తేదీన కాంటా చేసి లారీలో లోడింగ్ చేసి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని అపర్ణ రైస్ మిల్లుకు అటాచ్ చేశారు. ఆ ధాన్యాన్ని తీసుకోవడానికి మిల్లర్లు నానా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ధాన్యం తీసుకోకపోవడంతో ఆరు రోజులపాటు రైస్ మిల్లు వద్దనే లారీ ఉండిపోయింది. ఎట్టకేలకు మే 23వ తేదీన అపర్ణ రైస్‌మిల్లులో దిగుమతి చేసుకున్నారు. ఆ ధాన్యానికి ఏ గ్రేడ్‌గా కాకుండా ఒకరిద్దరి ధాన్యం సరిగా లేదని మొత్తం కామన్ కింద రాసుకొని అపర్ణ రైస్‌మిల్లు వాళ్లు దిగుమతి చేసుకున్నారు. కానీ ధాన్యం బాగున్నప్పటికీ అందరివి కామన్ కింద ఎలా రాస్తారు అని రైతులు అడిగ్గా కామన్ అయితేనే దించుకుంటాం లేకపోతే దించుకోం అంటూ బెదిరించాడు. అపర్ణ రైస్ మిల్లు యాజమాన్యం ఇలా చేయడం వల్ల చాలా నష్ట పోయామని, మాకు ఏ గ్రేడ్ కిందనే ఇవ్వాలి అని రైతులు వాదిస్తున్నారు. నెల రోజుల నుంచి పంచాయతీ నడుస్తునే ఉంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక వైపు వర్షాలు పడుతున్నాయి. విత్తనాలు ఎరువులు కొనుక్కుందాం అంటే చేతిలో చిల్లి గవ్వలేదు. మరో వైపు అమ్ముకున్న ధాన్యం డబ్బులు రాకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, సివిల్ సప్లయ్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ధాన్యం డబ్బులు ఇప్పించాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు. ఈ విషయమై సిద్దిపేట సివిల్ సప్లయ్ అధికారి హరీశ్‌ను వివరణ కోరగా, ఆ విషయం తమ దృష్టికి రాలేదని, మెదక్ డీఎంతో, రైస్‌మిల్లు యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో సుమారుగా రూ.45 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో 76,990 మంది రైతుల నుంచి 3,13,358 క్వింటాళ్ల ధాన్యాన్ని రూ. 690.30 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. వీటిలో రూ.680 కోట్లు రైతులకు చెల్లించారు. ఇంకా రూ.10.32 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. మెదక్ జిల్లాలో 68,600 మంది రైతుల నుంచి 2,84,153 క్వింటాళ్ల ధాన్యాన్ని రూ.625.99 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఇప్పటివరకు రూ.591.53 కోట్లు రైతులకు చెల్లించారు. ఇంకా రూ. 34.46 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉన్నది. వర్షాలు పడుతుండడంతో ఎవుసానికి రైతుల వద్ద డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం డబ్బులు త్వరగా చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మే చివరి నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి, డబ్బులను సకాలంలో రైతులకు అందజేసి ఆదుకుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి.