దుబ్బాక, సెప్టెంబర్ 12: కాంగ్రెస్ ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు హైడ్రా పేరిట హైడ్రామా కొనసాగిస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులకు భరోసా లేకుండా పోయిందని, పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా పోయాయని ధ్వజమెత్తారు. గురువారం దుబ్బాకలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ…ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి డబ్బు సంచులు పంపించేందుకే తెలంగాణలో రేవంత్ సర్కారు హైడ్రాను ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పేదలను పూర్తిగా విస్మరించిందన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం పడకేయడంతో ప్రజలు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, విష జ్వరాలతో తల్లడిల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనారోగ్యంతో ప్రజలు దవాఖానలకు పోతే అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీల ఎన్నికలు లేక, ప్రత్యేకాధికారులతో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయని విమర్శించారు.
రైతుల ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ సర్కారేనని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఇటీవల నియోజకవర్గంలో అక్బర్పేట-భూంపల్లి మండలం చిట్టాపూర్‌కు చెందిన రైతు సోలిపేట సురేందర్‌రెడ్డికి రుణమాఫీ కాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తొగుట మండలంలో కాన్గల్‌లో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమన్నారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ సర్కారు కారణమని మండిపడ్డారు. రైతు రుణమాఫీ కోసం నిత్యం రైతులు బ్యాంకుల వద్దకు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
కల్యాణలక్ష్మి చెక్కులు ఇప్పటివరకు మంజూరు చేయకపోవడం సిగ్గు చేటన్నారు. నియోజకవర్గంలో సూమారు 12వందల మంది లబ్ధిదారులకు అందాల్సిన కల్యాణలక్ష్మి చెక్కులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన అరికపూడి గాంధీ బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ మాట్లాడటం సిగ్గు చేటని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీని ప్రశ్నించిందుకు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం హేయనీయమన్నారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.
కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఇటీవల దుబ్బాక నియోజకవర్గానికి చెందిన ఇద్దరు బీఆర్ఎస్ కార్యకర్తలు మృతి చెందారు. వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. గురువారం దుబ్బాకలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు అందజేశారు.
దుబ్బాక మండలం పెద్దగుండావెళ్లి గ్రామానికి చెందిన గుడూరి మల్లయ్య కుటుంబానికి, తొగుట మండలకేంద్రానికి చెందిన చింత నారాయణ కుటుంబీకులకు మంజూరైన రూ.2 లక్షల చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు. ఆనంతరం 270 మంది బాధితులకు రూ.90 లక్షలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. దుబ్బాకలో పలు వినాయక మండపాల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో, అన్నదాన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, కడతల రవీందర్‌రెడ్డి, కొత్త కిషన్‌రెడ్డి, కైలాశ్, భూంరెడ్డి, ఎల్లారెడ్డి, బాలకిషన్ గౌడ్, నారాగౌడ్, ఆస స్వామి, యాదగిరి, జీడిపల్లి రవి, రాంరెడ్డి, రామస్వామి గౌడ్, కృష్ణ, నరేశ్, తిరుపతిరెడ్డి, సంజీవ్‌రెడ్డి, సత్యానారాయణ, తదితరులు పాల్గొన్నారు.