గులాబీ దండు భగ్గుమన్నది. హత్యారాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై నిందితుడు గుటాని రాజు దాడి చేశాడు. దీంతో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించారు. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ప్రజాప్రతినిధులు దాడిని ముక్తకఠంతో ఖండించారు. మృదుస్వభావి..నిత్యం ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి.. మంచి మనస్సున్న ఎంపీ కొత్తపై దాడిచేయడం గర్హనీయమన్నారు. చీమకు కూడా హానితలపెట్టని ఇలాంటి ప్రజానేతపై దాడి జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఆర్థిక,వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎంపీ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. సిద్దిపేట సీపీ శ్వేత పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ ఘటనపై ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం సంఘటనకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు మంగళవారం దుబ్బాక నియోజకవర్గం బంద్‌కు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో, ప్రతి గ్రామంలో ఉదయం 11 గంటలకు నల్లజెండాలతో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.