పటాన్చెరు, ఏప్రిల్ 24: పటాన్చెరు మండలంలోని బచ్చుగూడ గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లెప్రకృతి వనం కళావిహీనంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బృహత్ పల్లెప్రకృతి వనానికి శంకుస్థాపన చేసి, మొక్కలు నాటించారు. నిత్యం మొక్కలకు నీరుపోసి సంరక్షించారు. దీంతో మొక్కలు పెరిగి పరిసరాలు ఆహ్లాదంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొక్కలకు నీరు పోయకపోవడంతో పాటు సంరక్షణ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నాటిన మొక్కలు ఎండిపోయి నర్సరీ ఎడారిని తలపిస్తున్నది.
రూ. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన నర్సరీకి గేట్ ఉన్నా పర్యవేక్షణ లేక మేకలు, పశువులు వచ్చి మొక్కలను ధ్వంసం చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు స్వచ్ఛమైన గాలిని, ఆహ్లాదాన్ని అందించడం, కోతులు గ్రామాల వైపు రాకుండా ఉండేందుకు నాటి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేయించారు. ప్రతి గ్రామంలో పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేసి, ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ చేయడంతో పాటు గ్రామంలో రోడ్లకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో నీడనిచ్చే, పండ్లు ఇచ్చే మొక్కలు నాటించారు. నాటిన మొక్కలను కాపాడేందుకు ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేశారు.
మొక్కలకు నీరు పోసేందుకు గ్రామ పంచాయతీలకు టాక్టరు, ట్యాంకర్లు అందించారు. దీంతో పల్లెప్రకృతి వనాల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పండ్లు సైతం కాశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నర్సరీల నిర్వహణ, హరితహారం మొక్కల సంరక్షణను గాలికి వదిలేశారు. దీంతో ప్రస్తుతం పల్లెప్రకృతి వనాలు ఎండిపోయి అధ్వానంగా కనిపిస్తున్నాయి. హరితహారం మొక్కలు ఎండిపోయాయి. చాలాచోట్ల చెట్లు నరికివేతలకు గురవుతున్నాయి. దీంతో పర్యావరణ పరిరక్షణ అనే లక్ష్యం దెబ్బతింటున్నది.