Akkannapet | రామాయంపేట రూరల్, మార్చి04 : రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరాఫరా నిలిచిపోయింది. దీంతో మహిళలు బోరుబావులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంగళవారం అధికారులు ట్యాంకర్ ఏర్పాటు చేసి కాలనీల్లో తాగునీరు సరాఫరా చేశారు. ఉదయం పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయానికి వంట చేయడానికి కూడా నీరు లేని పరిస్థితి నెలకొందన్నారు. విషయాన్ని అధికారులకు చెబితే రోడ్డు పనుల వల్ల మిషన్ భగీరథ పైపులైన్లు రిపేరు, కొన్నిచోట్ల పగిలిపోవడం, లైన్లు పక్కలకు జరపడం వల్ల నీటి సరాఫరా చేయడంలో అంతరాయం కలిగిందని చెప్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
మిషన్ భగీరథ పైపు లైను సమస్య ఉంటే గ్రామాల్లోని పంచాయితీకి చెందిన మోటర్లు ఎందుకు నడిపించడం లేదని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏ ఒక రోజు కూడా తాగునీటి కోసం రోడ్డుకు ఎక్కలేదని పేర్కొన్నారు. ఈ విషయమై మిషన్ భగీరథ ఏఈ కిరణ్‌కుమార్‌ను వివరణ అడుగగా రోడ్డు వెడల్పులో భాగంగా ఆర్అండ్బి అధికారులు మిషన్ భగీరథ పైపు లైన్లు మార్చడం, ఉన్నచోటు నుండి రోడ్డు వెడల్పు కోసం దూరం మార్చడం వల్ల నీటి సరాఫరాకు అంతరాయం కలిగిందన్నారు. రేపటి నుండి యదావిధిగా నీటి సరాఫరా జరుగుతుందన్నారు.
గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి నీటి గోస రాలేదు. మూడు రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోజు మాత్రమే ట్యాంకర్ వచ్చింది. ఒకవేళ ట్యాంకర్ కూడా రాకుంటే వ్యవసాయ పొలాల వద్ద నుండి నీటిని తెచ్చుకోవల్సిన పరిస్థితి. ఎండాకాలం మొదట్లోనే ఇలా సమస్య వస్తే ఎండాకాలం పూర్తయ్యేవరకు మా పరిస్థితి ఏంటీ. గ్రామంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటి సారి అని అంటున్నారు.
తాగునీటి కోసం రెండు రోజులు చాలా అవస్థలు పడ్డాం.మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో చుట్టు పక్కల అందుబాటులో బోర్లు నుండి నీటిని తెచ్చుకున్నాం. గ్రామ పంచాయితీ బోర్ల నుండి కూడా మాకు తాగునీరు రాలేదు. అధికారులు ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలి. మళ్లీ ఇలాంటి ఘటనలు రాకుండా చూడాలని కోరుతున్నారు.