గజ్వేల్, జూన్ 15: పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ అధికారులకు తలనొప్పిగా మారింది. లబ్ధిదారులు పట్టాలెప్పుడిస్తారని గజ్వేల్ మున్సిపల్, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు లక్కీడ్రా పద్ధతిలో ఎంపిక చేసి అర్హులను ప్రకటించారు. అయితే డ్రాలో ఎంపికైన వారిలో అనర్హులున్నరంటూ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖను మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి మరోసారి రీ సర్వే చేయించాలని కోరారు. మరోసారి రీ సర్వే చేస్తే తమ పేర్లు వచ్చేనా అంటూ డ్రాలో ఎంపికైన లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తీసుకునే నిర్ణయం కోసం లబ్ధిదారులు వేచి చూస్తున్నారు.
గజ్వేల్ పట్టణ సమీపంలోని సంగాపూర్ వద్ద డబుల్ బెడ్రూం ఇండ్లను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వేల అనంతరం అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో లక్కీడ్రా తీసి అర్హులను ప్రకటించారు. అయితే వారికి పట్టా సర్టిఫికెట్లను ఇవ్వకపోవడంతో పలుమార్లు ఆందోళన చేపట్టారు. ఆరు నెలలుగా లబ్ధిదారులు డబుల్ ఇండ్ల కోసం అనేకసార్లు రోడ్డెక్కిన సమయంలో రెవెన్యూ, పోలీస్ అధికారుల జోక్యం చేసుకొని జిల్లా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంలో సమస్య సద్దుమణుగుతుంది. ఇటీవల లబ్ధిదారులు పట్టా సర్టిఫికెట్లు అందజేసి ఇండ్లు చూపించాలని కోరుతూ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిని కలిసి సమస్యను వివరించడంతో జిల్లా అధికారులతో మాట్లాడుతానని చెప్పడంతో ఆందోళన విరమించారు.
లబ్ధిదారుల ఎంపికలో అనర్హులకు అవకాశం లభించిందని, మరోసారి రీసర్వే చేయించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖను మాజీఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో సీఐటీయూ నాయకులు కలిసి సమస్యను తెలిపారు. రీ సర్వే చేస్తే డ్రాలో ఎంపికైన వారి పరిస్థితి ఎలా అంటూ లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. లక్కీ డ్రాలో ఎంపికైన వారు ఇంటి నెంబర్ ఆధారంగా ఇప్పటికే కొంతమంది ఇండ్లలోకి ప్రవేశించి నివాసం ఉంటుండగా మరికొంత మంది ఇండ్లకు తాళాలు వేసుకున్నారు. అధికారులు తీసుకునే నిర్ణయం మేరకు లబ్ధిదారుల భవిష్యత్ ఆధారపడి ఉంది.
మల్లన్న సాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు తాత్కాలికంగా అదే ఇండ్లలో అధికారులు నివాసం కల్పించారు. ముంపు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం నుంచి ప్యాకేజీలు రావాల్సి ఉందని, వాటిని పూర్తిస్థాయిలో అధికారులు ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన తర్వాతనే ఇండ్లు ఖాళీ చేస్తామంటున్నారు. గత నెలలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇండ్లలో నివాసం ఉంటున్నవారి వివరాలు తెలుసుకునేందుకు వెళ్లగా ముంపు గ్రామాల ప్రజలు అధికారులను అడ్డుకున్నారు. డబుల్ ఇండ్లలో నివాసం ఉంటున్న ముంపు గ్రామాల ప్రజలు ఖాళీ చేస్తేనే సమస్య పరిష్కారం కాదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వారు ఖాళీ చేయాలంటే ప్యాకేజీలు ఇవ్వాలని, అందుకు ప్రభుత్వం సహకరిస్తే కాని సమస్య కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు.