గూడులేని శ్రమజీవులకు సాకారం కానున్న సొంతింటి కల
పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దుబ్బాకలో ఒకేచోట వెయ్యి ఇండ్లు
ఆగస్టు మొదటివారంలో మంత్రి చేతులమీదుగా మూడో విడత ఇండ్ల పంపిణీ
టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలన
వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నారని, అర్హులకు తప్పక ఇండ్లు అందిస్తామని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలో ఆయన పర్యటించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, వర్షాలతో నియోజకవర్గంలో వాటిల్లిన నష్టం తదితర అంశాలపై మొదట దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం దుబ్బాక పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించి, లబ్ధిదారులతో ముచ్చటించారు. దుబ్బాకలో ఇప్పటికే రెండు విడతల్లో ఇండ్లు అందజేశామని, ఆగస్టు మొదటి వారంలో మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా మూడో విడత ఇండ్లు పంపిణీ చేస్తామని చెప్పారు.
దుబ్బాక, జూలై 15 : గూడు లేని శ్రమజీవులకు సొంతింటి కల సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టారని టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పర్యటించారు. మొదట దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు, మౌలిక వసతులు, ఇటీవల కురిసిన వర్షాలతో నియోజకవర్గంలో వాటిల్లిన నష్టం తదితర వాటిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం దుబ్బాక పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం డబుల్‌బెడ్ రూం ఇండ్లలో ఉంటున్న లబ్ధిదారులను కలిసి వారితో ముచ్చటించారు. తమకు సొంతింటి కల సాకారం చేసిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుకు రుణపడి ఉంటామని లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. దుబ్బాక పట్టణంలో 885 డబుల్ బెడ్రూం ఇండ్లకు గాను ఇప్పటి వరకు మొదటి, రెండో విడతల్లో మొత్తం 315 మంది లబ్ధిదారులకు మున్సిపల్ పాలకవర్గం ఇండ్లను అందజేసిందని, మిగిలిన వారికి ఆగస్టు మొదటి వారంలో (శ్రావణమాసంలో) మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా పంపిణీ చేస్తామన్నారు.
భారీ బహిరంగ సభ నిర్వహించి, దుబ్బాక పట్టణంతో పాటు మండలంలో పలు గ్రామాలలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. దుబ్బాక డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీ మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఇందులో అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాలనీ ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తామన్నారు. కాలనీలో ఉన్న 85 ఇండ్ల బ్లాక్‌లకు కమిటీలు వేస్తామని చెప్పారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయలేనటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణలో అమలు చేస్తూ, ప్రజారంజక పాలన కొనసాగిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారు, ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దుబ్బాకలో ఒకేచోట వెయ్యి ఇండ్లు నిర్మించడం ఎంతో సంతోషకరమని, ఇది దుబ్బాక ప్రజలకు వరం లాంటిదన్నారు. దుబ్బాకలో ఇల్లు లేని పేదలు లేకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ సూచనల మేరకు భారీ సంఖ్యలో ఇండ్లు మంజూరు చేశారన్నారు.
త్వరగా వసతులు కల్పించాలి
డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీల్లో త్వరతిగతిన వసతులు కల్పించాలని అధికారులతో జరిగిన సమీక్షలో ఎంపీ పేర్కొన్నారు. దుబ్బాకలో నిర్మించిన 872 డబుల్ బెడ్రూంలకు 587 ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారులను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేయగా, 315మంది లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేశారని, మిగిలిన వారికి ఆగస్టులో డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తామన్నారు. ఇండ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేశ్‌రెడ్డి, తహసీల్దార్ సలీం, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ తదితర శాఖల అధికారులతో పాటు మున్సిల్ చైర్పర్సన్ గన్నె వినతాభూంరెడ్డి, వైస్ చైర్పర్సన్ అదికం సుగుణాబాలకిషన్గౌడ్, దుబ్బాక ఎంపీపీ పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కైలాస్, రేకులకుంట దేవాలయ చైర్మన్ రొట్టే రమేశ్, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు రొట్టె రాజమౌళి, కొత్త కిషన్‌రెడ్డి, బానాల శ్రీనివాస్, నారాగౌడ్, వంశీగౌడ్, ఖలీల్ పాల్గొన్నారు.
ఇండ్లు కూలిన బాధితులకు భరోసా
వర్షాలకు కూలిన పలు ఇండ్లను ఎంపీ పరిశీలించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని బాధితులకు ఆయన హామీ ఇచ్చారు. ఇండ్లు కూలిపోయిన బాధితులకు దుబ్బాకలో డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం దుబ్బాక మండ లం గంభీర్పూర్లో ఇటీవల మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ కాల్వ బాబు కుటుంబాన్ని పరామర్శించారు. హసన్మీరాపూర్లో టీఆర్ఎస్ నాయకులు బాల్తే వెంకటేశం తండ్రి మృతి చెందగా, వారి కుటుంబీకులను పరామర్శించారు. హసన్‌మీరాపూర్-అప్పనపల్లి బీటీ రోడ్డు మంజూరు చేయాలని రెండు గ్రామల ప్రజలు ఎంపీకి విన్నవించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలో రోడ్డుకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రాజక్కపేట సర్పంచ్ పద్మాపర్వతాలు కూతురు మానస ఇంటర్(ఎంపీసీ)లో ఫస్టియర్‌లో స్టేట్ 4వ ర్యాంకు సాధించినందుకు ఆమెను ఎంపీ సన్మానించి, అభినందించారు.
సీఎం కేసీఆర్ హయాంలో ఆలయాల అభివృద్ధి
దుబ్బాక టౌన్, జూలై 15 : రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన పురాతన ఆలయాలు సీఎం కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి చెందుతున్నాయని మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని రేకులకుంట మల్లికార్జునస్వామి ఆలయంలో ఆషాఢ బోనాలు ఆలయ చైర్మన్ రొట్టె రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి బోనమెత్తి ఎల్లమ్మ దేవతకు సమర్పించారు. పట్నాలు వేసే కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అనంతరం రేణుకామాత ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జట్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితభూంరెడ్డి, వైస్ చైర్పర్సన్ అధికం సుగుణబాలకిషన్గౌడ్, కమిషనర్ గణేశ్‌రెడ్డి, కౌన్సిలర్లు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొని పూజలు చేశారు.
అనంతరం విలేకరుల సమావేశంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక ప్రాంతంలో వందేండ్ల చరిత్ర గల రేకులకుంట మల్లికార్జునస్వామి ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారన్నారు. మల్లన్న ఆలయాన్ని రూ.3 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి మాట ఇచ్చారని తెలిపారు. మల్ల న్న దయతో దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ సాగు జలాలు అందుతున్నాయన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతకుముందు ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి ఆలయ చైర్మన్ రొట్టె రమేశ్, ఒగ్గు పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కైలాశ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సద్ది రాజిరెడ్డి, నాయకులు రొట్టె రాజమౌళి, బానాల శ్రీనివాస్, వంశీకృష్ణ, రాధామనోహర్‌రెడ్డి, సంజీవరెడ్డి, మూర్తి శ్రీనివాస్‌రెడ్డి, పల్లె రామస్వామిగౌడ్, నందాల శ్రీకాంత్, నగరం రవి, కృష్ణ, చిట్టాపూర్ సర్పంచ్ రాజయ్య, నారాగౌడ్, మిరుదొడ్డి మండల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.