జహీరాబాద్, సెప్టెంబర్ 26 : ఫార్మాసిటీపై పోరుబాటకు మూడు గ్రామాలకు చెందిన భూ బాధితులు ప్రతిన బూనారు. వారికి పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పర్యావరణ నిఫుణులు దొంతి నర్సింహారెడ్డి మద్దతు పలికారు. గురువారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం డప్పూర్లో ఫా ర్మాసిటీ భూబాధితులతో వారు సమావేశమయ్యా రు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం పర్యావరణ అనుమతులు, గ్రామసభలు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా సర్వేలు చేపట్టి భూములు లాక్కోని రైతులను రోడ్డుపాలు చేయడం సరికాదన్నారు. ఫార్మాసిటీతో ఆయా గ్రామాల పరిధిలో గాలి, నీరు, నేలా అన్నీ కలుషితమైపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ నుంచి వెలుబడే వ్యర్థాలతో ఉమ్మడి జిల్లాతోపాటు జంటనగరవాసులకు తాగు, సాగుకు జీవనాధారమైన మం జీరా నది (సింగూర్ ప్రాజెక్టు)కాలుషితం కాబోతుందన్నారు. ప్రజలను ఇబ్బందులు గురిచేసే ఫార్మాసిటీని అడ్డుకోవాలని, శాంతియుతంగా పోరాటం చేయాలన్నారు.
ప్రాణాలైన ఇస్తాం. కానీ, మూడు పంటలు పండే సారవంతమైన భూములను ఫార్మాసిటీకి మాత్రం ఇవ్వమని భూ బాధితులు పర్యావరణ వేత్తలతో కన్నీరు పెట్టుకున్నారు. వ్యవసాయమే జీవనాధారం గా చేసుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. ఫార్మాసిటీతో శాశ్వతంగా భూములను కోల్పోవడంతో తమ జీవితాలు రోడ్డు పాలవుతాయని ఆందోళన వ్య క్తం చేశారు.
ఫార్మాసిటీని ఏర్పాటు చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని భూబాధితులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామ నాయకులు రవీందర్, సుభాశ్ గుప్తా, రవికుమార్, శివరాజ్, నాగన్న, మారుతీయాదవ్, ఓంకర్ యాదవ్, శివరాజ్, శ్రీపాతి, పూండికూర రవికుమార్, రాజుగౌడ్, ఎల్లారెడ్డి, సునీల్, ఆయా గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.