రవితేజ హీరోగా రూపొందుతున్న ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ప్రియా భవానీశంకర్ ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె ‘కావేరి’ అనే పాత్రను పోషిస్తున్నట్టు మేకర్స్ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ఫస్ట్‌లుక్‌లో ప్రియా భవానీశంకర్ బుగ్గపై హీరో రవితేజ ముద్దుపెడుతూ కనిపించగా, ఆమె సహజమైన ఆహార్యంతో అందంగా నవ్వుతూవుంది. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను ఈ పోస్టర్ ఆవిష్కరిస్తున్నది. నేపథ్యంలో ఉన్న అరటిపళ్ల బండి, హీరోహీరోయిన్ల ఆహార్యాలను బట్టి ఇది గ్రామీణ నేపథ్యంతో కూడిన సినిమా అని తెలుస్తున్నది. ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన పవర్ఫుల్ కథ ఇదని, తండ్రీకూతుళ్ల అనుబంధం ఈ కథకు హైలైట్ అని మేకర్స్ చెబుతున్నారు. రవితేజ కూతురుగా బేబీ నక్షత్ర నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విష్ణుశర్మ, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్.