హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులకు యూరియా తిప్ప లు తప్పడంలేదు. మొన్నటివరకు క్యూలతో గోసపడ్డ రైతులకు.. ఇప్పుడు యూరియా యాప్‌తో కష్టాలు మరింత పెరిగాయి. యాప్ కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు రొడ్డెక్కుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన వ్యక్తంచేస్తున్నారు. యాప్‌ను రద్దు చేసి పాత విధానంలోనే యూరియా పంపిణీ చే యాలని డిమాండ్ చేస్తున్నారు.
యాప్ ద్వారా యూరియా పంపిణీని వ్యవసాయ శాఖ తొలుత ఆరు జిల్లాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టుగా చేపట్టగా ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం మెజారిటీ జిల్లాల్లో యాప్ ద్వారానే యూరియా పంపిణీ చేస్తున్నది. యాప్ ద్వారా రైతులకు సులువుగా యూరియా లభిస్తున్నదంటూ వ్యవసాయ శాఖ ప్రకటనలు చేస్తున్నది. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నది. యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయలేక రైతు లు తిప్పలు పడుతున్నారు. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా యాప్‌కు వ్యతిరేకంగా రైతులు ధర్నాలు చేస్తు న్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా ఖానాపురం, కరీంనగర్ జిల్లా కొండపల్కలలో యూరియా యాప్‌కు వ్యతిరేకంగా రైతులు ధర్నాకు దిగారు. కరీంనగర్లో తాడికల్‌లో 230 బస్తాల యూరియా స్టాక్ రాగా క్షణాల్లోనే యూరియా అయిపోవడంతో ఆగ్రహించిన రైతులు జాతీయ రహదారిపై ధర్నా చేశారు.
కరీంనగర్ జిల్లా కన్నాపూర్లోనూ ధర్నాకు దిగారు. నల్లగొండ జిల్లా తిప్పర్తిలో స్టాక్ వచ్చిన 35 సెకండ్లలోనే బస్తాలు మా యం కావడంతో ఆందోళనకు దిగారు.కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో 330 బస్తాల యూరియా స్టాక్ రాగా యాప్‌లో బుక్ కాలే దు. కొద్ది సమయం తర్వాత సమస్యను పరిష్కరించగా క్షణాల్లోనే ఇతర ప్రాంతాల రైతులకు యూరియా బుక్ కావడంతో రైతులు నిరసన చేపట్టారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇలా ఎక్కడ చూసినా రైతులు యాప్‌కు వ్యతిరేకంగా ధర్నాలకు దిగుతున్నారు. నిర్మల్ జిల్లా నిర్మల్, సోన్ మండలాల్లో ఆదివారం పలు ఫర్టిలైజర్ షాపుల్లో యారియా నిల్వలను యాప్‌లో చూడగా ‘జీరో’ చూపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. యూరియా లోడ్ ఫర్టిలైజర్ దుకాణానికి రాగానే డీలర్ ఆన్లైన్లో నమో దు చేసిన పది నిమిషాల్లోనే అందుబాటులో ఉన్న రైతులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని తీసుకెళ్తున్నారని, మిగతా వారికి దొరకడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
చదువురాని రైతులు, స్మార్ట్ఫోన్లులేని రైతు ల గోస వర్ణనాతీతంగా ఉన్నది. చదువురాని రైతులకు, స్మార్ట్ఫోన్లు లేని రైతులకు యూరి యా దొరకడంలేదు. యాప్‌లో స్టాక్ కనిపించగానే ఇతర రైతులు వేగంగా బుక్ చేసుకోవడంతో వీళ్లకు మొండిచేయే మిగులుతున్నది. ఏఈవోలు, ఇతరులను బతిమాలి బుక్ చేసుకునేలోపే స్టాక్ అయిపోతున్నది. తర్వాత వచ్చి న రైతులు ఉత్తచేతులతో వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చదువురాని, స్మార్ట్ఫోన్లులేని రైతులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యాప్‌లో మండలాలు దాటి యూరియా బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఊర్లోనే తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఏ మండలం లో బుక్ అయితే, ఆ మండలానికి వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తున్నది. ఖమ్మం జిల్లాలో కొందరికి 70కిలోమీటర్ల దూరంలో యూరియా బుక్ కావడంతో అక్కడినుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది.
యూరియా స్టాక్ చూపించిన క్షణాల్లోనే మాయమవుతున్నట్టు రైతులు చెప్తున్నారు. ఎన్ని వందల బస్తాలు ఉన్నప్పటికీ, కొద్దిసేపట్లోనే జీరో చూపిస్తున్నదని, ఆ కొద్ది సేపట్లోనే బస్తాలు ఏమైతున్నాయనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉన్నది. షాపుల యజమానులు, ఇతర డీలర్లు వారే రైతుల పేరుతో యూరియా బుక్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సైబర్ మోసాలు విచ్చలవిడిగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో రైతులు యూరియా యాప్ కారణంగా సైబర్ వలలో చిక్కుకుంటున్నారు. యూరియా యాప్‌లో ఓటీపీ నమోదు చేసే విధానం ఉండటంతో సైబర్ మోసాలకు మరింత సులభంగా మారింది. దీంతోపాటు యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే క్రమంలో రైతులు ఏపీకే ఫైల్స్‌ను క్లిక్ చేస్తున్నారు. దీంతో వారి ఖాతాలోని సొమ్ము అటునుంచి అటే మాయమైపోతున్నది. దీంతో యూరియా యాప్ సైబర్ భద్రత ఎంతనే ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యూరియా యాప్ విధానాన్ని ఎత్తేసి పాత పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.