సిద్దిపేట అర్బన్, మార్చి 5: గత ప్రభుత్వాలు ప్రజల కోసం చేసిన మంచి పనులు, పథకాలను అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కొనసాగిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లోని రంగనాయకసాగర్ ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో వరి పంట సాగవుతున్నదని, పంట చేతికొచ్చే సమయానికి నీళ్లు లేకపోతే రైతులు ఇబ్బంది పడతారని తానే మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేశానన్నారు. అనంతసాగర్ నుంచి టీఎంసీ నీళ్లను రంగనాయకసాగర్‌కు పంపినందుకు మంత్రికి ఈ సందర్భంగా హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టాలని చూస్తున్నదని, ఇది మంచి పరిణామం కాదన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్-2లో తుంగతుర్తి, సూర్యాపేట, భూపాలపల్లి ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయని, గతంలో ఎస్సారెస్పీ నీరు తగ్గినప్పటికీ, కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీటిని అందించామని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 15 రిజర్వాయర్లు, 203 కి.మీల టన్నెలు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, ప్రెజర్ మెన్లు అన్నీ బాగున్నాయని, కానీ.. మేడిగడ్డలో ఒక పిల్లర్ మాత్రమే కుంగిపోతే దాన్ని గోరంతను కొండంత చేసి బీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు.
నేడు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, ఆ నీళ్లను లిఫ్ట్ చేసి లక్షల ఎకరాల పంటలను కాపాడే అవకాశం ప్రభుత్వానికి ఉందన్నారు. కేసీఆర్ మీద కోపంతోనో, బీఆర్ఎస్ మీద కోపంతోనో, తెలంగాణ రైతులకు అన్యాయం చేయవద్దని ప్రభుత్వానికి ఆయన హితవు పలికారు. సిద్దిపేట ప్రాంతంలో 500 నుంచి 1000 ఫీట్ల బోర్లు వేసినా నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేది కాదని, నేడు రంగనాయకసాగర్ కింద, అనంతగిరి కింద, మల్లన్నసాగర్ కింద పండే పంట కాళేశ్వరం పంట కాదా అని ప్రశ్నించారు. కండ్లు ఉండి చూడలేని కబోదుల్లా.. చెవులు ఉండి వినలేని చెవిటి వాళ్లలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. కాళేశ్వరం కుంగిందన్న వారు, ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న పంట కాలువల పనులు పూర్తి చేయాలని, తద్వారా రైతులతో పాటు మత్స్యసంపద పెరిగి మత్స్యకారులకు ఆదాయం వస్తుందని ప్రభుత్వానికి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలకు మంచి చేసే మేడిగడ్డ ప్రాజెక్టును నిర్లక్యం చేయవద్దని, కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ కండ్లు తెరవకపోతే.. చరిత్ర క్షమించదని హరీశ్‌రావు అన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.