సంగారెడ్డి సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 15 : మంత్రి హరీశ్‌రావు నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నందున పక్కా ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. నేడు ఉదయం 10గంటలకు మంత్రి పటాన్చెరు చేరుకొని జీఎంఆర్ ఫంక్షన్హాల్లో బీసీ కుల వృత్తులు, మైనార్టీలకు ఆర్థిక సహాయం చెక్కులను, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేస్తారని తెలిపారు.
జీవో 58కింద హౌజ్ సైట్ పట్టా సర్టిఫికెట్లు, జీవో 59కింద కన్వీనియన్స్ డీడ్స్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తారన్నారు. 11గంటలకు కంది మండలం చిమ్నాపూర్ చెరువులో చేప పిల్లలు వదులుతారని వెల్లడించారు. 11:30 గంటలకు కొండాపూర్ మండలం మల్కాపూర్‌లోని గోకుల్ గార్డెన్స్‌లో దివ్యాంగులకు పెంచిన ఫింఛన్ల ప్రొసీడింగ్స్, మైనార్టీలకు ఆర్థిక సాయం చెక్కులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేస్తారని తెలిపారు.
సంగారెడ్డి పట్టణంలో మైనార్టీలకు ఖబరస్థన్ కోసం కేటాయించిన భూమికి సంబంధించిన ఉత్తర్వులను ముస్లిం పెద్దలకు, క్రిస్టియన్ మైనార్టీలకు కేటాయించిన భూ కేటాయింపు ప్రొసీడింగ్స్ అందజేస్తారని వివరించారు. జీవో-58కింద ఫేజ్-2లో హౌజ్ సైట్స్ పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారన్నారు.
మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు గదుల ప్రారంభోత్సవం, 12:45గంటలకు భరోసా కేంద్రం ప్రారంభం, మధ్యాహ్నం ఒంటి గంటకు పంచాయతీ కార్యదర్శులకు నియామక ఉత్తర్వులు అందజేస్తారని పేర్కొన్నారు.
ఎస్ఎస్జీ-2023 అవార్డులను ఆయా సర్పంచులు, కార్యదర్శులకు అందజేస్తారన్నారు. మధ్యాహ్నం 3:15 గంటలకు అందోల్ ఏఎస్ ఫంక్షన్హాల్లో దివ్యాంగులకు పెంచిన పింఛన్ల ప్రోసీడింగ్స్, మైనార్టీలకు ఆర్థిక సాయం చెక్కులను, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేస్తారని తెలిపారు. జీవో 58,59 లబ్ధిదారులకు హౌజ్సైట్స్ పట్టాల పంపిణీ చేసిన అనంతరం సాయం త్రం 5గంటలకు సింగూర్ రిజర్వాయర్‌లో చేప పిల్లలను వదులుతారని కలెక్టర్ వివరించారు.
టెలీకాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో నగేశ్, జడ్పీసీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రి పాల్గొనే కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొననున్నారు.