సంగారెడ్డి,సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వం రోజురోజుకూ పని ఒత్తిడి పెంచుతున్నది. దీంతో ప్రభుత్వంపై క్షేత్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రైతులకు రూ.2 లక్షల పంట రుణమాఫీ, రైతుభరోసా, కౌలు రైతులకు ఆర్థిక సహాయం తదితర హామీలను ఇచ్చింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పంటరుణమాఫీ, రైతుభరోసా, కౌలు రైతులకు ఆర్థిక సహా యం తదిరత హామీలను నిలబెట్టుకోవడం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అవసరమైన నిధులు లేకపోవడంతో పథకాల అమలుకు కొర్రీలు పెడుతూ మెజార్టీ రైతులను జాబితాల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నది. ఇందుకోసం అర్హులైన రైతులను గుర్తించేందుకు క్షేత్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులు సిబ్బందితో సర్వేలు చేపడుతున్నారు. జిల్లాలో ఇది వరకే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు(ఏఈవో)లు పంట రుణమాఫీకి సం బంధించి గ్రామాల్లో పర్యటిస్తూ రైతుల వివరాలు సేకరిస్తున్నారు.
ప్రతి రైతు కుటుంబం వివరాలను ఆన్లైన్లో నమోదుచేస్తూ రైతు కుటుంబాల ఫొటోలు తీసుకుని ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. రైతుబీమా, పీఎంకిసాన్, పంటనమోదు, పంటనష్టం సర్వే పనులను ఏఈవోలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు రైతునేస్తం, పంటకోత ప్రయోగాలు తదితర కార్యక్రమాలను ఏఈవోలు నిర్వహిస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏఈవోలకు ‘డిజిటల్ క్రాప్ సర్వే’ పనులను అప్పగించింది. గ్రామాల్లోని రైతు లు ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారు, ఏ రకాల పంటలు సాగు చేస్తున్నారు తదితర వివరాలను ఏఈవోలు సేకరించడంతో పాటు పంటల ఫొటోలను తీసి ఆన్లైన్ యాప్లో పొందుపర్చాల్సి ఉంటుంది.
ఇందుకోసం ఏఈవోలు తప్పనిసరిగా సర్వేనెంబరు, రైతువారీగా పంటల సాగు వివరాలను నమోదు చేయాలి. జిల్లాలో ప్రస్తుతం 116 మంది ఏఈవోలు పని చేస్తున్నారు. వీరిలో 58 మంది మహిళా అధికారులు ఉన్నారు. ప్రతి ఏఈవో పరిధిలో 10వేల నుంచి 6500ఎకరాల వరకు సాగుభూములు ఉన్నాయి. గ్రామంలోని పొలాలకు వద్దకు వెళ్లి క్రాప్ డిజిటల్ సర్వే పూర్తి చేయాలంటే తీవ్ర పనిఒత్తిడి పెరుగుతుందని, వర్షాకాలంలో పంట పొలాల్లోకి వెళ్లడం కష్టంగా మారిందని ఏఈవోలు చెబుతున్నారు.
ప్రతి పొలం వద్దకు వెళ్లి వివరాలు సేకరించాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని మహిళా ఏఈవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే పని ఒత్తిడిలో ఉన్న తమ పై మరింత పనిభారం మోపవద్దని, క్రాప్ డిజిటల్ సర్వే బాధ్యతల నుంచి తమను తప్పించాలని ఏఈవోలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్(వీఏఏ)లను నియమించి వారికి క్రాప్ డిజిటల్ సర్వే బాధ్యతలు అప్పగించాలని ఏఈవోలు డిమాండ్ చేస్తున్నారు.