సంగారెడ్డి, జనవరి 13(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో అధికార కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ అధిష్టానానికి ప్రజాప్రతినిధుల్లో నెలకొన్న అంతర్గత పోరు సవాలుగా మారుతున్నది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలను ఎలా చక్కదిద్దాలో తెలియక కాంగ్రెస్ అధిష్టానం సతమతమవుతున్నట్లు తెలిసింది.
జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేతకు, జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేతకు మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఇద్దరు నేతలు ఒకే వేదికను పంచుకోవడం లేదు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో సైతం కలిసికట్టుగా పాల్గొనడం లేదు. ఇద్దరు నేతల మధ్య దూరం పెరుగుతుండడం జిల్లాలో పార్టీకి నష్టం చేకూరుస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇద్దరు నేతల మధ్య విభేదాల కారణంగా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నష్టపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఓ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య కూడా విభేదాలు నెలకొన్నాయి. నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇద్దరు నేతల మద్య మనస్పర్ధలకు కారణంగా తెలుస్తున్నది. నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ ఎస్సీకి రిజర్వు అయ్యింది. ఈ పదవి తన అనుచరుడికి కట్టబెట్టాలని ఎంపీ పట్టుదలగా ఉన్నారు. అదే సమయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తన అనచరునికి ఇప్పించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే పావులు కదుపుతున్నారు.
ఒకే పదవి కోసం ఇద్దరు ఎవరికి వారే పట్టుబడుతున్నారు. తమ అనుచరులకు పదవి ఇప్పించేందుకు ఎంపీ, ఎమ్మెల్యే ఎవరికివారే తమ రాజకీయ పరపతిని వినియోగిస్తున్నారు. సీడీసీ చైర్మన్ పదవి ఎమ్మెల్యే వర్గం నేతలకు దక్కినందున, మార్కెట్ కమిటీ పదవి తన వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని ఎంపీ డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని జిల్లాకు చెందిన మంత్రి, కాంగ్రెస్ ముఖ్యనేతల దృష్టికి ఎంపీ తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే మాత్రం తన వర్గానికి చెందిన వ్యక్తికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం.
దీంతో ఇద్దరు నేతలు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎవరికివారే పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి పొందడం ద్వారా నియోజకవర్గంలో తమ పెత్తనం చాటుకోవాలని ఇద్దరు నేతలు పట్టుదలగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ కమిటీ పదవి కోసం ఇద్దరు నేతల గొడవ పడుతుండడం పార్టీకి నష్టం కలిగిస్తుందని, ఇద్దరి మధ్య విభేదాలు ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య పవర్ పాలిటిక్స్ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలైన కాటా శ్రీనివాస్‌గౌడ్ నియోజకవర్గంలో పెత్తనం కోసం పోటీ పడుతున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కాటా శ్రీనివాస్‌గౌడ్ పటాన్చెరు సెగ్మెంట్లో తాను చెప్పిందే జరగాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా అధికారుల పోస్టింగ్‌ల వ్యవహారంలో పట్టుదలగా ఉన్నారు. కాటా శ్రీనివాస్‌గౌడ్ సూచించిన అధికారులకు ఎవరికీ ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వడం లేదు. దీంతో కాటా శ్రీనివాస్‌గౌడ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
ప్రభుత్వం, పార్టీ తీరును నిరసిస్తూ ఇటీవల తన మద్దతుదారులతో కలిసి పీసీసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేయడంతో పాటు పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్కను కలిసి ఫిర్యాదు చేశారు. కాటా శ్రీనివాస్‌గౌడ్‌కు తగిన ప్రాధాన్యత దక్కేలా చూస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. దీంతో కాటా తనకు న్యాయం జరుగుతుందని భావించారు. అయితే తాజాగా పటాన్చెరు నియోజకవర్గంలో అధికారుల పోస్టింగ్‌లలో మళ్లీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పైచేయి సాధించినట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటున్నారు.
కాటా శ్రీనివాస్‌గౌడ్ సూచించిన అధికారులకు కాకుండా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సూచించిన అధికారులకు పోస్టింగ్‌లు దక్కినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా పోలీసు శాఖలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సూచించిన అధికారులకు పోస్టింగ్‌లు దక్కడం కాటాకు మింగుడు పడడం లేదు. ఇటీవల అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల పోలీస్స్టేషన్లలో కాటా శ్రీనివాస్‌గౌడ్ సూచించిన అధికారులను కాకుండా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సూచించిన అధికారులకు పోస్టింగ్‌లు లభించినట్లు సమాచారం.
దీంతో కాటా శ్రీనివాస్‌గౌడ్, మహిపాల్‌రెడ్డి మధ్య మరోసారి పవర్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. దీంతో ఇద్దరు నేతల మధ్య విభేదాలు మరింత పెరుగుతున్నాయని, ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుందని పటాన్చెరు కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి చెక్ పెట్టాలని కాటా శ్రీనివాస్‌గౌడ్ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికోసం తనదైన శైలిలో పావులు కదుపుతున్నట్లు ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు.