హుస్నాబాద్ టౌన్, నవంబర్ 3: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బల్దియాలో అభివృద్ధి పనులు ముందుకెళ్లడం లేదు. పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు రూ.40 కోట్లు మంజూరయ్యాయి. కానీ, అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. హుస్నాబాద్ పట్టణంలోని ఇరవై వార్డుల్లో అంతర్గత రహదారులు, మురుగుకాల్వలు, విద్యుత్, మంచినీటి వసతుల కల్పనకు టీయూఎఫ్ఐడీసీ నిధులు మంజూరయ్యాయి.
ఈ నిధుల ద్వారా సీసీరోడ్లు, మురుగుకాల్వలు, పార్కు, మున్సిపల్ నూతన భవనం ప్రహరీ, కమ్యూనిటీ హాళ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ పనులకు సంబంధించి ఆన్లైన్ టెండర్లు నిర్వహించి ఏజెన్సీలకు పనులు అప్పగించి రెండు నెలలు గడుస్తున్నది. ఆయా వార్డుల్లో పనుల శం కుస్థాపనకు ప్రత్యేకంగా శిలాఫలకాల నిర్మాణాలు సైతం చేపట్టారు. కానీ, పనుల్లో పురోగతి లేకపోవడంతో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని అభివృద్ధి పనులు పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
హుస్నాబాద్ పట్టణానికి టీయూఎఫ్ఐడీసీ కింద మంజూరైన రూ.40కోట్ల పనులకు టెండర్లు పూర్తి చేసి వర్క్ ఏజెన్సీలకు అప్పగించాం. నెలన్నర రోజులు గడుస్తున్నది. పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు సూచించాం. ఇంకా కొన్ని అగ్రిమెం ట్లు చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి కృషి చేస్తాం.
– పృథ్వీరాజు, హుస్నాబాద్ మున్సిపల్ ఏఈ