వేగంగా విస్తరిస్తున్న హుస్నాబాద్ పట్టణానికి తెలంగాణ ప్రభుత్వం సైతం అంతే వేగంగా నిధుల వరదను పారిస్తున్నది. నిధులు లేక సమస్యల వలయంలో చిక్కుకుని విలవిలలాడిన హుస్నాబాద్ నేడు సమస్యలను అధిగమించి అభివృద్ధికి కేరాఫ్‌గా మారింది. ఇప్పటికే రెండుమార్లు జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అవార్డులను సాధించిన హుస్నాబాద్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా శుక్రవారం హుస్నాబాద్ పర్యటన సందర్భంగా పట్టణాభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరుచేయడంతో పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హుస్నాబాద్ టౌన్, మే 6: సమైక్య పాలనలో సమస్యల కుంపటిలో కొట్టుమిట్టాడిన హుస్నాబాద్ పట్టణ స్వరూపం స్వరాష్ట్రంలో పూర్తిగా మారిపోయింది. పేదలు నివసించే ప్రాంతాల్లో కనుచూపు మేర కనిపించని అభివృద్ధి నేడు ముందుగానే ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసే కార్యాచరణ కొనసాగుతున్నది. లక్ష రూపాయల నిధులు ఇస్తే అదే పదివేలుగా భావించే ఈ పట్టణానికి ఇప్పుడు కోట్ల రూపాయల వరద పారుతుండటంతో సమస్యలన్నీ పరిష్కారానికి నోచుకుంటున్నాయి. మూడేళ్లలో పట్టణానికి దాదాపు రూ.30 కోట్లు మంజూరు చేసిందీ బీఆర్ఎస్ సర్కారు. పట్టణానికి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డును అందుకున్న తరుణంలో సైతం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ రూ. రెండు కోట్లు మంజూరు చేశారు. తాజాగా హుస్నాబాద్ పట్టణ పర్యటన సందర్భంగా మరో రూ.25 కోట్ల మంజూరుకు మంత్రి కేటీఆర్ పచ్చజెండా ఊపడంతో పట్టణవాసుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు..
హుస్నాబాద్ పట్టణాభివృద్ధికి వివిధ గ్రాంట్ల రూపంలో నిధుల వరద ఏటేటా పారుతున్నది. ప్లాన్ గ్రాంట్, టీయూఎఫ్ఐడీసీ, ఎస్ఎఫ్సీ, సబ్ ప్లాన్, 14వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి నిధులు సైతం పట్టణ అభివృద్ధికి కేటాయించారు. స్థానిక మల్లెచెట్టు వద్ద రూ.1.23 కోట్ల వ్యయంతో దుకాణాల సముదాయం నిర్మించగా, పట్టణ ప్రగతి నిధుల ద్వారా స్థానిక ఎల్లమ్మ చెరువు వద్ద రూ.30 లక్షలు ఖర్చుచేసి ఓపెన్ జిమ్, పార్కు నిర్మించారు. మినీస్టేడియం వద్ద రూ.2 కోట్ల వ్యయంతో ఇండోర్‌స్టేడియం, రూ.29. 52 లక్షల ఖర్చుతో తడి, పొడి చెత్త కోసం ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు. పట్టణంలోని 20 వార్డుల్లో 20 కిలోమీటర్ల మేర సీసీరోడ్లు, 11 కిలోమీటర్ల మేర మురికి కాల్వలను సైతం నూతనంగా నిర్మించారు. టీయూఎఫ్ఐడీసికి చెందిన 2 కోట్ల రూపాయలతో మున్సిపల్ భవనం నిర్మిస్తుండగా, తహసీల్ కార్యాలయ ఆవరణలో రూ.2.75 కోట్ల వ్యయంతో చేపట్టిన వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. స్థానిక మినీస్టేడియం వద్ద కోటి రూపాయల ఖర్చుతో అధునాతన సౌకర్యాలతో శ్మశాన వాటిక నిర్మిస్తున్నారు.
ప్రజావసర పనులకు నిధులు కేటాయిస్తాం..
పట్టణ ప్రజలపై ప్రేమతో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీర్ 25 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. పట్టణ ప్రజలకు అవసరమైన పనులను నిర్వహించేందుకు వీటిని కేటాయిస్తాం. ఇంకా సీసీరోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేయాల్సి ఉంది. వాటిని కూడా సమకూర్చేందుకు అధికారులకు ఆదేశాలు ఇస్తాం. హుస్నాబాద్ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం.
-వొడితెల సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే, హుస్నాబాద్
ఎమ్మెల్యే సూచనల మేరకు పనిచేస్తాం..
హుస్నాబాద్ పట్టణాభివృద్ధికి నిధులు కావాలని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ సార్ కోరగానే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు 25 కోట్ల రూపాయలను మంజూరు చేసినందుకు పట్టణ ప్రజల తరపున ధన్యవాదాలు. పట్టణాభివృద్ధి నిరంతరంగా సాగుతూనే ఉంది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25 కోట్లను ఏఏ అభివృద్ధి పనులకు కేటాయించాలనేది ఎమ్మెల్యే సలహాలు, సూచనలతో నిర్ణయిస్తాం. ఈ నిధులతో పట్టణంలో మిగిలిపోయిన సీసీరోడ్లు, మురికి కాల్వల పనులు దాదాపు పూర్తవుతాయని భావిస్తున్నాను.
-ఆకుల రజితావెంకన్న, హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్
పట్టణాభివృద్ధికి ఎమ్మెల్యే కృషి..
హుస్నాబాద్ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. దాదాపు వందకుపైగా గ్రామాలకు కూడలిగా ఉన్న హుస్నాబాద్ పట్టణాన్ని అన్నింటా అభివృద్ధి చెందేలా స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పట్టణ సమస్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ పరిష్కారానికి కావాల్సిన నిధులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 30 కోట్ల రూపాయలు మంజూరు చేయించి పలు అభివృద్ధి పనులను ప్రారంభింపజేశారు. తాజాగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ద్వారా పట్టణ అభివృద్ధికి రూ.25 కోట్లను మంజూరు చేయించారు.