సిద్దిపేట అర్బన్, నవంబర్ 26: కేసీఆర్ కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కేసీఆర్ చేపట్టిన దీక్ష రాష్ట్ర ఏర్పాటుకు బలమైన పునాదిగా నిలిచిందని ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, కడవేర్గు రాజనర్సు, రాధాకృష్ణశర్మ, ఇతర నాయకులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. వరంగల్ నగరంలో జరిగిన ఓ సభలో కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదాన్ని కేసీఆర్ చేశారని, అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యమం చేశారన్నారు.
నవంబర్ 29న సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో దీక్షా దీవస్ జరుపుకొంటామని.. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొంటారని తెలిపారు. దీక్షా దివాస్ వద్ద ఫొటో ఎగ్జిబిషన్‌తో పాటు కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎమ్మెల్సీ తెలిపారు.
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను వంచించిందన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ జపం చేస్తున్నారని విమర్శించారు. హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నదని స్టేటుమెంట్లు ఇస్తూ, తీరా రూ. కోట్లు ఖర్చు పెట్టి విజయోత్సవాలు నిర్వహించడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. అంతకుముందు సిద్దిపేట జిల్లా ముఖ్య నాయకులతో నవంబర్ 29న జరిగే దీక్షా దివస్ కార్యక్రమంపై సన్నాహక సమావేశం నిర్వహించారు.