పటాన్చెరు రూరల్, డిసెంబర్ 29: సిగాచి పరిశ్రమలో ఈ ఏడాది జూన్ 30న జరిగిన భారీ పేలుడుతో ఏర్పడిన అగ్నిప్రమాదంలో 54మంది మరణించిన ఘటనలో ఆరునెలల నిరీక్షణ అనంతరం కనిపించకుండా పోయిన ఎనిమిది మంది బాధిత కుటుంబాలకు డెత్ సర్టిఫికెట్లు మంజూరయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో సోమవారం సిగాచి ప్రమాదంలో ఆనవాళ్లు లేకుండా కాలిబూడిదైన ఎనిమిది మంది కుటుంబాలకు కార్మికులు, సిబ్బంది చనిపోయారని డెత్ సర్టిఫికెట్లు జారీ చేశారు. సంబంధిత కుటుంబాలకు చెందిన బాధ్యులు మున్సిపాలిటీకి వెళ్లి డెత్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. మున్సిపాలిటీ మేనేజర్ మధుసూదన్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు డెత్ సర్టిఫికెట్లు అందజేశారు. సుదీర్ఘకాలంగా డెత్ సర్టిఫికెట్లు రాకపోవడంతో బాధితుల్లో నిర్వేదం కనిపించింది. జూన్ 30న ప్రమాదం సంభవించిన తర్వాత శవాలు, వారి అవయవాలు కనిపించిన వారి డీఎన్ఏ టెస్టులు చేసి మరణించినట్లుగా గుర్తించారు.
పలువురు పలు దవాఖానల్లో చికిత్స పొందుతూ మరణించారు. వారికి సంబంధిత మున్సిపాలిటీల్లో డెత్ సర్టిఫికెట్లు మంజూరు చేశారు. దాదాపు 46మందికి డెత్ సర్టిఫికెట్లు అధికారులు మంజూరు చేశారు. కానీ మృతదేహాలు, వారి తాలూకు ఎలాంటి శరీర అవయవం కనిపించని 8మంది కార్మికులు చనిపోయినట్లుగా రుజువు లేనందుకు వారికి డెత్ సర్టిఫికెట్ మంజూరు కాలేదు. వంద రోజుల్లో కనిపించని వ్యక్తులకు డెత్ సర్టిఫికెట్లు ఇస్తామని బాధిత కుటుంబాలకు నచ్చజెప్పి అధికారులు వారిని కంపెనీ వద్ద నుంచి పంపించివేశారు. చనిపోయినవారి మృతదేహాలు కానరాక, చనిపోయినట్లుగా అధికారులు ధ్రువీకరించకపోవడంతో కర్మకాండలు చేసేందుకు అస్థికలు లేక బాధిత కుటుంబాలు నరకయాతన అనుభవించాయి. కొందరు కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించిన చోట నుంచి కాలిన బూడిదను అస్థికలుగా భావించి అంత్యక్రియలు చేసుకోవడం అందరినీ కలిచివేసింది. మైనార్టీలు, క్రిష్టియన్ కార్మికుల కుటుంబాలకు శరీర భాగాలు లభించక ఖననం చేయలేక నేటికీ అంత్యక్రియలే నిర్వహించుకోలేదు.
సిగాచి పరిశ్రమ యాజమాన్యం డెత్ సర్టిఫికెట్లు ఉన్నవారికి ఇన్సూరెన్స్‌లు, ఇతర అలవెన్స్‌లు, పీఎఫ్ తదితర బెనిఫిట్స్‌ను ఒక్కొక్కరికీ రూ. 42లక్షలు ఆపైన అందేలా చూసుకుంది. డెత్ సర్టిఫికెట్స్ రాని ఎనిమిది మంది మిస్సింగ్ కార్మిక కుటుంబాలకు మాత్రం మొండిచెయ్యి చూపించింది. ఈ నెల 30న రాష్ట్ర హైకోర్టులో సిగాచి పరిశ్రమ ప్రమాదంపై విచారణ జరగనుంది. డిసెంబర్ 9న జరిగిన విచారణలో హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాదం జరిగిన విధానంపై, విచారణ జరుగుతున్న తీరుపై, యాజమాన్యం అరెస్టుపై అధికారులను నిలదీసింది. ఇస్తామని ప్రకటించిన రూ. కోటి నష్టపరిహారం ఎందుకు ఆలస్యమవుతుందని వివరణ అడిగింది. కోర్టు ఆగ్రహం నేపథ్యంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని గ్రహించిన అధికారులు శనివారం రాత్రి సిగాచి సీఈవో అమిత్‌రాజ్ సిన్హాను అరెస్ట్ చేసి 14రోజుల రిమాండ్‌కు పంపించారు. రెండో చర్యగా సోమవారం డెత్ సర్టిఫికెట్లు రాని ఎనిమిది మంది కుటుంబాలకు యుద్ధప్రాతిపదికన సర్టిఫికెట్లు అందించారు.
కీలకమైన నష్టపరిహారం రూ. కోటి చెల్లింపుపై మాత్రం కొత్త ఎత్తుగడను యాజమాన్యం అవలంబిస్తున్నది. ఎనిమిది కుటుంబాలకు డెత్ సర్టిఫికెట్లు లేవని ఇన్నాళ్లు డబ్బులు ఇవ్వని పరిశ్రమ యాజమాన్యం ఇప్పుడు రూ. 17లక్షల చెక్కులను మార్చి 2026 డేట్లు వేసి కార్మికశాఖ అందజేసినట్లు బాధిత కుటుంబాలు తెలిపాయి. ఆ చెక్కులు మాకొద్దని బాధిత కుటుంబాలు తిరస్కరిస్తున్నాయి. ఇప్పుడే పూర్తి నష్టపరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 46 కుటుంబాలకు వివిధ రూపాల్లో రూ. 42లక్షలు అందేలా చూసిన యాజమాన్యం ఈ ఎనిమిది మందికి మాత్రం రూ. 17లక్షలు వచ్చే ఏడాది మార్చిలో ఇచ్చేలా ప్లాన్ చేస్తూ చెక్కులు అందిస్తామని ముందుకు వచ్చింది. అంతపెద్ద పరిశ్రమ పోస్టుడేటెడ్ చెక్కులు ఇవ్వాలనుకోవడం విమర్శలకు తావిస్తున్నది. ఈ నెల 30న కోర్టు నష్టపరిహారం చెల్లింపులపై ఇచ్చే ఆదేశాలపై బాధితుల్లో కోటి ఆశలు ఉన్నాయి.