సంగారెడ్డి జూలై 6 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) సంగారెడ్డి జిల్లాలో మందకొడిగా కొనసాగుతుంది. జిల్లా యం త్రాంగం సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించలేదు. దీంతోపాటు బీఎల్వోలు చురుగ్గా పనిచేయక జిల్లాలో సర్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో సాగడం లేదు. సర్‌లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలు స్వీకరణకు ఈనెల 24వతేదీ తుది గడువు. ఈనెల 1వ తేదీ వరకు వందశాతం ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 89 శాతం పూర్త్తయినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో 70 శాతం మాత్రమే దరఖాస్తు ఫారాలు ఇం డ్లకు చేరాయి. సర్‌పై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్న ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు ఇంకా అందక తమ ఓట్లు పోతాయని కలవరపడుతున్నారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో బూత్‌లెవల్ అధికారులు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయాల్సి ఉంది.
అధికారుల సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లాలో 14,57,435 ఎన్యుమరేషన్ ఫారాలను అధికారులు ముద్రించారు. ఇందులో ఇప్పటి వరకు 13,08,412 ఎన్యుమరేషన్ ఫారాలు పట్టణాలు, గ్రామాల్లో పంపిణీ చేశారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 2,33,275 ఫారాలు, అందోల్‌లో 2,49,275, జహీరాబాద్‌లో 2,67,782, సంగారెడ్డిలో 2,42,447, పటాన్చెరులో 3,15,633 ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ పూర్తయ్యింది. జిల్లాలో 89 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ పూర్తి కాగా ఇంకా 11 శాతం పంపిణీ పూర్తి కావాల్సి ఉంది. ఈనెల 24న ఎన్యుమరేషన్ ఫారాలు నింపి బీఎల్వోలకు అప్పగించాల్సి ఉంటుంది. బీఎల్వోలు తమకు వచ్చిన దరఖాస్తులను డిజిటలైజేషన్ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఇప్పటి వరకు 39,819 ఎన్యుమరేషన్ ఫారాలను మాత్రమే బీఎల్వోలు డిజిటలైజేషన్ చేశారు.
ఎన్యుమరేషన్ దరఖాస్తుల పంపిణీలో అధికార యంత్రాంగం కంటే రాజకీయ పార్టీల బీఎల్ఏలు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయాల్సి ఉంది. బీఎల్వోలు ఎన్యుమరేషన్ ఫారాలను రాజకీయ పార్టీల నాయకులకు అప్పగించి ఓటర్లకు పంపిణీ చేయాల్సిందిగా సూచిస్తున్నారు. దీంతో ప్రధాన రాజకీయపార్టీలు నియమించుకున్న బూత్ లెవల్ ఏజెంట్లు ఎన్యుమరేషన్ ఫారాలను స్వయంగా ఓటర్లకు అందజేస్తున్నారు. ఎన్యుమరేషన్ ఫారాలు అందుకున్న గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలోని మున్సిపల్ వార్డులు, గ్రామాల్లో బీఎల్ఏలు ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంతో పాటు వాటిని తిరిగి బీఎల్వోలకు అప్పగిస్తున్నారు. బీఎల్ఏలు గ్రామాల్లో తమకు నచ్చని ఓటర్లు, వలస ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారా లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్యుమరేషన్ ఫారాలు నింపటంలో బీఎల్వోలు బాధ్యత తీసుకుని సహకరించాలని ఓటర్లు కోరుకుంటున్నారు. జిల్లా యంత్రాంగం సర్, ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో సందేహాలను తీర్చేందుకు సంగారెడ్డి కలెక్టరేట్లో (1950, 08455-254465) ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు.
బీఎల్వోలు గ్రామాలు, పట్టణ వార్డుల్లో ప్రతి ఓటరు ఇంటిని సందర్శించడం, ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్లు నింపేలా చూడటం, ఓటర్లు స్థానికంగా లేకపోతే ఫోన్లు చేయాల్సి ఉంటుంది. మెజార్టీ గ్రామాలు, వార్డుల్లో ఈ ప్రక్రియ కొనసాగడంలేదు. దీంతో ఓటర్లు తమ ఓట్లు తొలిగిపోతాయని ఆందోళన చెందుతున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో ఓట్లు పోతాయని ముస్లిం మైనార్టీలు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, జోగిపేట, నారాయణఖేడ్, పటాన్చెరు, అమీన్పూర్ ప్రాంతంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
వీరిలో చాలామంది ఓటర్ల పేర్లు 2002 జాబితాలో కనిపించటం లేదు. దీంతో తమ ఓట్లు పోతాయని ముస్లిం మైనార్టీలు కలవరపడుతున్నారు. సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గంలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిషా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న వలస ఓటర్లు ఉన్నారు. వీరికి ఎన్యుమరేషన్ ఫారాలు అందడంలేదు. జిల్లా ఓటర్లుగా ఉండి ఇతర ప్రాంతాలకు ఉద్యోగ రీత్యా వెళ్లినవారు సైతం ఎన్యుమరేషన్ ఫారాలు నింపే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2002లో ఓటర్ల జాబితాలో పేర్లు కనిపించని ఓటర్లు సైతం సర్‌పై ఆందోళన చెందుతున్నారు. 2002లో ఎక్కడ ఓటు ఉంది, ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశామన్న వివరాలు తెలియక ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.