పటాన్చెరు, జూలై 1: ప్రభుత్వం వైఫల్యం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతోనే సిగాచీ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం జరిగిందని కార్మికుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రసాయన ఫ్యాక్టరీలను తనిఖీ చేసి యంత్రాలను, రియాక్టర్లను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అధికారులు నిర్లక్ష్యంతో పనిచేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యాలు అనుభవం ఉన్న కార్మికులను పనిలో పెట్టుకోవడం లేదు.
సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కార్మికులు ఉంటే ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ లేకుండా పోయింది. అధికారులు నామమాత్రంగా పరిశ్రమలను తనిఖీ చేసి నివేదికలు సమర్పిస్తున్నట్లు తెలిసింది.దీంతో తరుచూ ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరిగి ఎంతోమంది కార్మికులు చనిపోతున్నారు.
ప్రమాదాలు జరిగిన సమయంలో అధికారులు హడావిడి చేస్తున్నారు. తరువాత ఫ్యాక్టరీలు తనిఖీలు చేయడం లేదు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం సిగాచీ రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగి కార్మికులు మృతిచెందడంతో అనేక విమర్శలు వస్తున్నాయి. సిగాచీ రసాయన పరిశ్రమలో 36 మంది కార్మికులు చనిపోయిన్నట్లు అధికారులు తెలుపుతున్నా, ఇప్పటి వరకు 46 మంది కార్మికులు చనిపోయినట్లు తెలిసింది. 34 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
సిగాచీ పరిశ్రమ వద్దకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారని మంగళవారం అధికారులు పటాన్చెరు దవాఖాన వద్ద హడావిడి చేశారు. సీఎం పటాన్చెరు నుంచి తిరిగిపోగానే అధికారులు ఎవరు దవాఖాన వద్ద కనిపించలేదు. పోలీసులు తప్పా రెవెన్యూ అధికారులు అటువైపు రాలేదు. సమాచారం అడిగినా బిజీగా ఉన్నామని సమాధానం చెప్పారు. చనిపోయిన వారి మృతదేహాలు గుర్తించేందుకు అధికారులు విఫలమయ్యారు. దవాఖాన వద్దకు బిహారు, ఏపీకి చెందిన ఎక్కువ మంది కార్మికుల కుటుంబ సభ్యులు వచ్చారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ సిగాచీ పరిశ్రమను మంగళవారం పరిశీలించారు. కార్మికులకు మైరుగైన వైద్యంతో పాటు చనిపోయిన కార్మికులకు న్యాయం చేస్తామని వారు ప్రకటించారు. సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ ఫ్యాక్టరీ వద్ద ఉండి మృతదేహాలు బయటకు తీసేందుకు కృషి చేశారు. రెవెన్యూ అధికారులు కార్మికుల సమాచారం సేకరించడంలో విఫలమయ్యారు. కార్మికుల కుటుంబాలకు సమాచారం అందించడంలో పటాన్చెరు రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరించారు. కార్మికుల మృతదేహాలు గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పటాన్చెరు సర్కారు దవాఖాన వద్ద మంగళవారం సిగాచీ ఫ్యాక్టరీ కార్మిక కుటుంబాలు కన్నీరు పెట్టుకున్నాయి. దవాఖాన వద్దకు బిహారు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువులు భారీ సంఖ్యలో వచ్చారు. ఎక్కువ మంది కార్మికుల ఆచూకీ తెలువక పోవడంతో కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
దవాఖాన వద్ద కార్మికుల కుటుంబీకులు, బంధువులు రోదనలు మిన్నంటాయి. దవాఖాన పోస్టుమార్టం గది వద్ద మృతదేహాలు కుప్పులుగా పడి ఉండడంతో తమవారు మృతిచెంది ఉండవచ్చని రోదిరించారు. పటాన్చెరు దవాఖాన వద్ద కార్మికుల కుటుంబాలకు సమాచారం తెలిపేందుకు అధికారులు ఎలాంటి హెల్ప్‌లైన్, హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయలేదు. దీంతో ఉదయం నుంచి ఎదురుచూసినా తమ వారి ఆచూకీ లభించక పోవడంతో కార్మికుల కుటుంబాల్లో దు:ఖం పొంగుకొచ్చింది.