ములుగు, మార్చి 29: రైతులపై అధికారులు అక్రమ కేసులుపెట్టి భయభ్రాంతులకు గురిచేయడం అప్రజాస్వామికమని డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఎండిపోతుంటే చూడలేక రైతులు కాలువకు గండికొట్టి నీరందిస్తే 9 మందిపై నీటిపారుదల శాఖ అధికారులు కేసులు పెట్టడం అన్యాయ మన్నారు.
నర్సంపల్లిలో కాలువ ద్వారా తమ పొలాలకు నీరందించాలని ఏడాదిగా రైతులు నీటిపారుదల శాఖ అధికారులకు విన్నవిస్తే పట్టించుకోవడం లేదన్నారు. వారి సమస్య పరిష్కరించకుండా కేసులు పెట్టడంపై అధికారుల తీరును ఆయన ఖండించారు. రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభు త్వం చివరికి వారిపై కేసులు పెట్టి పాపాన్ని మూటగట్టుకుందని విమర్శించారు. భేషరుతుగా రైతులపై కేసులు ఎత్తివేసి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోకుండా కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా చెరువులకు, కుంటలకు నీరందించాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, శ్రీనివాస్, సందీప్‌రెడ్డి, రాజిరెడ్డి, రైతులు ఉన్నారు.