జహీరాబాద్, జూన్ 14 :తొలుత ప్రతిపాదించిన మాదిరిగా హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ రైల్‌ను జహీరాబాద్ మీదుగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, మెదక్ ఎంపీ రఘునందన్‌ను జహీరాబాద్ బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రిని, ఎంపీని వారి నివాసంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అధ్యక్షతన అఖిలపక్ష ప్రజాప్రతినిధులు, నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ.. హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ లైన్ కోసం మొదటి విడత రూపొందించిన డీఆర్పీ అలైన్మెంట్లో జహీరాబాద్ రూట్‌ను పొందుపరిచారని, రెండో విడత డీఆర్పీ అలైన్మెంట్లో జహీరాబాద్‌కు బదులుగా కోకాపేట్, వికారాబాద్ మీదుగా లైన్ ఖరారు చేశారని వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిమ్జ్, స్మార్ట్‌సిటీ రూపుదిద్దుకుంటున్న జహీరాబాద్ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి దామోదర్, మెదక్ ఎంపీ రఘునందన్ హామీ ఇచ్చినట్లు అఖిలపక్షం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు గిరిధర్‌రెడ్డి, శివకుమార్, ఉజ్వల్‌రెడ్డి, గొల్ల భాస్కర్, పాండురంగారెడ్డి, విజేందర్‌రెడ్డి, సుభాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.