పుల్కల్, జనవరి 27: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వైద్యారోగ్య శాఖల మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు. సోమవారం సింగూరు ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ప్రాజెక్టులో 50 సీట్ల కెపాసిటీతో నడిచే రెండు ఆధునాతన సౌకర్యాలతో కూడిన స్పీడ్ బోట్లను ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. సింగూరు ప్రాజెక్టుకు పెద్దఎత్తున పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్, రోడ్ మ్యాప్‌లను రూపొందించాలన్నారు. ప్రాజెక్టులో ఉన్న ఐల్యాండ్ వాచ్ టవర్‌పైన రెస్టారెంట్, ఫుడ్ కోర్టు, చిల్డ్రన్ ప్లే ఏరియా, ల్యాండ్ స్కేపింగ్, ఆర్ట్ స్కేపింగ్, గార్డెన్లను అభివృద్ధి చేయాలని సూచించారు.
ప్రాజెక్టు దిగువ భాగంలోని 29 ఎకరాల్లో రూ.ఐదు కోట్లతో అధునాతన రెస్టారెంట్, 25 కాటేజీలు నిర్మించాలని, ఇందులో చిల్డ్రన్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టు, గార్డెనింగ్, గ్రీనరీ, ల్యాండ్ స్కేటింగ్, పార్కింగ్ ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సింగూరు డ్యాం పైభాగంలో బీటీ రోడ్డు నిర్మించాలని, పర్యాటకుల కోసం డ్యాం పైకి వెళ్లేందుకు అవసరమైన మెట్ల నిర్మాణం, డ్యాంక్బండ్ వెంట పార్క్ అభివృద్ధి, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రాజెక్టు పరిసరాల్లో సెంట్రల్ లైటింగ్‌కు అవసరమైన ప్రతిపాదనలను ఫిబ్రవరి మొదటి వారంలోగా రూపొందించాలని అధికారులకు సూచించారు.