గజ్వేల్, మే 30: ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని గొప్పలు చెప్పుకొంటున్నన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాగా, అధికారులకు, అధికార పార్టీ నాయకులకు నిరుపేద దళిత మహిళ కనిపించడం లేదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అన్ని అర్హతలున్నా.. ఇల్లు మంజూరు కాకపోవడంలో తలదాచుకునే చోటు లేక కమ్యూనిటీ భవనంలో కొడుకుతో జీవనం సాగిస్తున్నది. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా దళిత మహిళకు మాత్రం న్యాయం చేయలేకపోతున్నారు.
పేరు పలుకుబడి ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పరిధిలోని కోమటిబండ గ్రామానికి చెందిన సుంచు శ్యామల భర్త నాగరాజు చనిపోయి పదకొండేళ్లు గడుస్తున్నది. గ్రామంలో ఉన్న పెంకుటిల్లు శిథిలావస్థకు చేరడంతో మూడేండ్ల క్రితం భారీ వర్షాలకు కూలిపోయింది. అప్ప టి నుంచి శ్యామల తన కొడు కు అర్జన్తో కలిసి కమ్యూనిటీ భవనంలో తలదాచుకుంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మం జూరు చేస్తామని చెప్పడంతో ఆశపడింది. తన కు ఇల్లు మంజూరు చేయించాలని శ్యామల స్థానిక నాయకులను కలిసి విషయాన్ని చెప్పింది. స్థానిక నాయకులు మొదటి విడతలో శ్యామల పేరుమీద ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయంచడంతో ఎంతో మురిసిపోయింది. అప్పటికే తన పాత ఇంటి స్థలంలోనే మంగళసూత్రం అమ్ముకొని బేస్మెంట్ నిర్మాణం పూర్తి చేసింది.
ఇందిరమ్మ ఇల్లు మంజూరైన తర్వాత లబ్ధిదారుల ఇంటి నిర్మాణ స్థలాల్లో ముగ్గు పోసే సమయంలో అధికారులు శ్యామల ఇంటికి చేరుకుని బేసెమెంట్ నిర్మాణం ఉంటే బిల్లులు రాదని చెప్పడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నది. చేసేదేమి లేక అధికారులు, స్థానిక నాయకుల సూచనలతో అప్పటికే నిర్మించుకున్న బేస్మెంట్ కూలకొట్టింది. తరువాత శ్యామలకు ఇల్లు మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నేటికీ ఆమె కమ్యూనిటీ భవనంలోనే నివాసం ఉంటున్నది. కొద్ది రోజుల క్రితం ఊరిలో పండుగ జరిగింది. బేస్మెంట్ కూల్చిన ప్రదేశంలోనే నాలుగు కట్టెలు పాతి పచ్చటి పందిరి వేసుకొని పండుగ చేసుకుంది. అన్ని అర్హతలు ఉన్న శ్యామలకు ఇల్లు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.