సినిమా అంటే వినోదం.. సినిమా అంటే వివేకం.. బాధలు.. సంతోషాలు.. ఆవేశాలు.. ఆలోచనలు.. అందాలు.. అనుబంధాలు.. అన్నీ సమపాళ్లలో రంగరించుకొని వెండితెర మా బంగారమే అనిపించుకుంది. ఆది నుంచీ యాక్షన్ సన్నివేశాల్ని అతిగా చూపించిన సినిమా.. ఈ మధ్య మరీ నెత్తురోడుతున్నది. సీను సీనులో రక్తం ఏరులై పారుతున్నది. ‘కత్తులన్ని కటకటా.. నెత్తురంత చిటపటా’ దిష్టి తీసుకొని మరీ ప్రేక్షక దేవుళ్లకు నెత్తుటి నివేదన సమర్పిస్తున్నది.
‘పైనేదో మర్డర్ జరిగినట్టు లేదు.. ఆకాశంలో! సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు..!’ ముత్యాలముగ్గు విలన్ ఏదో ఫ్లోలో చెప్పేసిన డైలాగు. కళాపోషణ బొత్తిగా లేని ఆ సెగెట్రీ ఏమో గానీ, ఆకాశంలో వెయ్యి మర్డర్లు జరిగినంతగా ఊహించేసుకున్నారు ఆ తరం ప్రేక్షకులు. ఆ అదృష్టం వారితోనే ఆవిరైంది. ఇప్పటి ప్రేక్షకులు వెండితెర మీద రుధిర తరంగాలు చూసి అదిరిపోతున్నారు. హీరోయిజం విశేషంగా పండించడం కోసం యాక్షన్ సన్నివేశాల్ని విపరీతంగా దృశ్యీకరిస్తున్న ఫలితంగా.. ఈ పరిస్థితి దాపురించింది.
సినిమా అంటే నవరసాల సమ్మేళనం. హాస్య రసాన్ని అపహాస్యం చేసి ఎన్నో ఏండ్లయ్యిందనుకోండి! శృంగార రసాన్ని అంగాంగ ప్రదర్శన స్థాయికి దిగజార్చడం మరో ఘనత. హీరోను వీరరస చక్రవర్తిగా చూపించాలనే తపనతో… రౌద్రం, భయానకం, బీభత్స రసాల్ని మిక్సీలో వేసి రుబ్బేసి తెరపై రక్తపాతం సృష్టించడం నయా ట్రెండ్. జుగుప్స కలిగించే రీతిలో తెరను ఎరుపెక్కిస్తున్నారు. నిన్నటికి నిన్న రిలీజైన నాని ‘ప్యారడైజ్’ టీజర్లో క్యూసెక్కుల కొద్దీ బ్లడ్ ఫ్లో సాగింది. రక్తమంతా పులుముకొని హీరో దిష్టి తీసుకుంటున్న దృశ్యం చూస్తే.. కటకటా అనాల్సిందే! గతంలోనూ ఈ తరహా బీభత్స, భయానక చిత్రాలు సెల్యూలాయిడ్ స్క్రీన్‌పై నెత్తురు చల్లాయి. ఇటీవలి కాలంలో ఈ ధోరణి మరీ పెరిగింది.
సినిమాల్ని చూడ చక్కగా చెక్కే జక్కన్న ‘సింహాద్రి’లో నెత్తురు రుచి చూపించాడు. అయితే, కథ డిమాండ్ చేయడం, విలన్ చేసిన అకృత్యాల కారణంగా.. అతణ్ని ఆ స్థాయిలో చంపితేనే సీన్ పండుతుందని రాజమౌళి నమ్మాడు. ప్రేక్షకులూ నమ్మేలా తీశాడు. ‘మగధీర’లో కాలభైరవుడు వందమందిని ఏకబిగిన మట్టుపెట్టినా… ఆ సీన్లో కనిపించే రాతి వంతెన అంతగా ఎరుపెక్కలేదు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన జానపద చిత్రరాజం ‘బాహుబలి’లో నెత్తుటి దాఖలాలు తక్కువే! కాలకేయులతో కళింగ యుద్ధం కన్నా గొప్పగా సాగిన సమయంలోనూ బాహుబలి, భల్లాలదేవుడు రక్తదాహం తీర్చుకోలేదు! చిన్న బాహుబలి, భల్లాలదేవుడు పరస్పరం భీకరంగా దాడి చేసుకున్నా… తెరంతా రక్తం చిందలేదు. ఆయనే తీసిన మరో క్లాసిక్.. ‘ఆర్ఆర్ఆర్’. టైటిల్‌కు ‘రౌద్రం, రణం, రుధిరం’ టీకా చెప్పినా, పీకల్లోతు నెత్తుట్లో ఎవరినీ ముంచలేదు జక్కన్న.
ఒకప్పుడు క్లయిమాక్స్ ఫైటింగ్ అనగానే లారీలకొద్దీ బుల్లి విలన్లు బెటాలియన్‌లా రంగప్రవేశం చేసేవాళ్లు. హీరో ఒంటి చేత్తో వారందరినీ మట్టి కరిపించేవాడు. రెండు కిక్కులు ఇచ్చేసరికి సదరు విలన్ కిక్కురుమనకుండా నేలకూలేవాడు. ఈ తరహా సీన్లు చూసి.. అప్పట్లో విమర్శకులు ఒక్కడు ఇంతమందిని రఫ్పాడించడం అలా ఎలా సాధ్యమో దర్శకుడికే తెలియాలని రివ్యూలు రాసేవారు. అసహజంగా అనిపించినా.. హీరో ఇమేజ్ ముందు సగటు అభిమాని ఆ సందేహాన్ని పైకి కనిపించకుండా సినిమాలో లీనమయ్యేవాడు. కారణం, అక్కడ రౌద్ర రసమే కానీ, జుగుప్స కలిగించే బీభత్సం కనిపించేది కాదు! మరిప్పుడో… విలన్ గ్యాంగ్‌లో ఏ ఒక్కడు చిక్కినా.. హీరో వాణ్ని కసితీరా నరికేస్తున్నాడు. ప్రేక్షకులు విస్తుపోయి చూస్తుండగా.. హీరో ఒక సైకో ఎక్స్ప్రెషన్ ఇస్తూ విలన్ ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తున్నాడు. ఎంతలా అంటే.. ఆ రౌడీ ఒంట్లోని రక్తమంతా తన ముఖం మీద పిచికారీ అయ్యేంతగా హింసిస్తూ పగ తీర్చుకుంటున్నాడు హీరో! ఇదేం టేకింగో అర్థం కాదు!! ఎందుకింత రక్తదాహమో తెలియదు. ‘జులాయి’ సినిమాలో త్రివిక్రమ్ సూచించినట్టు అప్పటికే హీరో అమ్మాయితో ఆడినా, పూదోటల్లో పాడినా… అతనిలో వయొలెన్స్ పాళ్లు ఎంతమాత్రం తగ్గవు!
స్క్రిప్ట్‌లో కావాల్సినంత సరుకు లేకపోతే.. రిస్క్ ఎక్కువ! దాన్ని తప్పించుకునే ఒకానొక మార్గం యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ!! అందుకే, ‘కథాకథనాలు ఎలా ఉన్నా.. యాక్షన్ సీన్లలో కొత్తదనం చూపించాడు దర్శకుడు’ అని ఇటీవలి సినిమా రివ్యూల్లో తరచూ కనిపిస్తున్న వాక్యాలు. యాక్షన్ అంటే.. ఫైటింగుల్లో వెరైటీలు చూపించడం వరకూ ఓకే! కానీ, నరకడంలో, నెత్తురు ఎగజిమ్మేలా పోట్లు పొడవడంలో సృజనాత్మకత ప్రదర్శించడమే రివాజుగా మారింది.
కొన్ని సినిమాల్లో సైకో విలన్లపై ఈ తరహా సీన్లు ఉన్నాయంటే కాస్తోకూస్తో ఒప్పుకోవచ్చు. విశాల్ హీరోగా వచ్చిన ‘డిటెక్టివ్’ సినిమాలో విలన్ రంపాలతో ఒక మృతదేహాన్ని ముక్కలు చెక్కలు చేస్తుంటాడు. వాళ్లంతా సైకో బ్యాచ్ కాబట్టి… దర్శకుడు ఆ తీవ్రతను చూపించే ప్రయత్నం చేశాడనుకొని సర్దుకోవచ్చు. కానీ, కథానాయకుడితో అలాంటి సైకో హీరోయిజం పండించడంలో పరమార్థం అంతుబట్టదు. రామ్‌చరణ్ హీరోగా వచ్చిన ‘వినయ విధేయ రామ’, ప్రభాస్ ‘సలార్’, నాని ‘హిట్-3’, సందీప్ వంగా ‘యానిమల్’, రణ్‌వీర్‌సింగ్ ‘దురంధర్’, ఉన్నిముకుందన్ ‘మార్కో’ తదితర చిత్రాల్లో రక్తం పండిన సీన్లు కొల్లలుగా కనిపిస్తాయి.
అంతలా రక్తం చిందకున్నా… ఆ సీన్లు కాస్త అటో ఇటో పండేవే! రక్తం ధారలు కట్టేలా కొట్టడం, విలన్ల తలకాయల్నే ఎగురగొట్టడం ట్రెండ్‌గా మారింది. పైగా హీరో కూడా రక్తమోడుతూనే ఉంటాడు. సహజంగా మానవ శరీరంలో నాలుగైదు లీటర్ల రక్తం ఉంటుంది. కథానాయకుడు అంతలా నెత్తుటిలో తడిసి ముద్దయితే.. విలన్లను కొట్టుడు సంగతి దేవుడెరుగు.. వాళ్లే కోమాలోకి వెళ్లిపోయే పరిస్థితి. వేర్ ద మ్యాజిక్ బిగిన్స్.. లాజిక్కు చోటు ఉండదు. అందుకే, హీరోలు రక్తంతో స్నానం చేసినా.. కనీసం వాళ్లకు కండ్లు తిరగవు, నీరసం ఆవహించదు. మరీ ఎరుపెక్కిన తెర వంక చూస్తున్న ప్రేక్షకుల ఆలోచనల్లో మాత్రం బీభత్స రసం డొపమైన్ హార్మోన్ కన్నా వేగంగా స్రవిస్తుంది.ఆ తరహా సినిమాలే వస్తూ ఉంటే, చూస్తూ పోతే..
సమాజంపై నెత్తుటి మరక ఖాయం.
ఇరుగు దిష్టి
పొరుగు దిష్టి
నల్లిగుడ్లోని దిష్టి
బెదురుగుడ్లోని దిష్టి
తూ.. తూ.. తూ..
కత్తుల కటకట
నెత్తుటి చిటపట నుంచి రక్తం రుచి మరిగిన వెండితెరకు దిష్టంతా పోవాలని ఆశిద్దాం!
– కణ్వస